ఎక్సైజ్ గజిటెడ్ అధికారుల సంఘం ఎన్నికలు ముగిశాయి. ఉపాధ్యక్ష పదవులు మినహా మిగిలిన అన్ని పదవులకు పోటీ లేకుండానే ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఆదివారం విజయవాడలో ఎన్నికలు నిర్వహించగా ఎలాంటి పోటీ లేకపోవడంతో ఇప్పటివరకూ అధ్యక్షుడిగా కొనసాగిన డిప్యూటీ కమిషనర్ ఎస్‌వీవీఎన్ బాబ్జీరావు తిరిగి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సూపరింటిండెంట్ సీహెచ్.లావణ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఏఈఎస్ సీహెచ్.నరే్‌షకుమార్, కోశాధికారిగా అసిస్టెంట్ కమిషనర్ వై.శ్రీనివాస్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పి.నారాయణ స్వామి, బి.రామ్మోహన్‌రెడ్డి, ఎం.జయరాజు ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారు. అయితే బాబ్జీరావు నేతృత్వంలోని గజిటెడ్ అధికారుల సంఘం గత రెండేళ్లలో ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదన్న విమర్శలున్నాయి. ఇటీవల సుమారు వంద మంది అధికారులకు పదోన్నతులు రావాల్సి ఉండగా, ఓ మధ్యస్థాయి అధికారి జోక్యంతో ఆగిపోయాయి. ఆ అధికారికి రాజకీయ పలుకుబడి ఉన్నందున తామేం చేయలేమని గజిటెడ్ అధికారుల సంఘం ఆ విషయాన్ని మధ్యలో వదిలేసింది. ఎక్సైజ్ ఉద్యోగ సంఘాలు నిర్వహించుకున్న సమావేశాలకు కూడా గజిటెడ్ అధికారుల సంఘం నేతలు హాజరు కాలేదు. దీంతో ఉన్నవారిని సాగనంపి, పనిచేసేవారిని ఎన్నుకోవాలని భావించారు. కానీ కొందరు అధికారులు చక్రం తిప్పి మళ్లీ పాత కార్యవర్గాన్ని ఎన్నుకునేలా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.