అచ్చుతాపురం: మండలంలో తంతడి పంచాయతీ శివారు వాడపాలెం సముద్ర తీరం ప్రకృతి రమణీయంగా వుంటుంది. తీరాన్ని అనుకుని కొండలు, సముద్రంలో వున్న రాళ్లను తాకుతూ ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటాయి. దీంతో వాడపాలెం బీచ్‌కు సెలవు రోజుల్లో, కార్తీక మాసంలో సందర్శకులు అధికంగా వస్తుంటారు. స్థానికులకన్నా విశాఖపట్నం, గాజువాక, అనకాపల్లి, పరవాడ, అగనంపూడి, స్టీల్‌ప్లాంట్ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. భోజనాలు వెంట తెచ్చుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహ్లాదంగా గడుపుతుంటారు.
అజాగ్రత్తతో ప్రమాదాలు
వాడపాలెం సముద్ర తీరం అత్యంత ప్రమాదకరం. తీరం ఆనుకుని కొండ వుండడంతో ఇక్కడ అలల ఉధృతి అఽధికంగా వుంటుంది. తీరానికి సమీపంలో బండరాళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో లోతు ఎక్కువ. నీటిలోదిగినా, బండరాళ్లపైకి వెళ్లినా ప్రమాదంబారిన పడే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా యువతీ యువకులు ఫొటోలు దిగడానికి బండరాళ్లపైకి వెళ్లి అలల తాకిడితో నీటిలో మునిగిపోతున్నారు. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో మృతి చెందినవారిలో ఎక్కువ మంది విద్యార్థులు, యువకులే ఉన్నారు. ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. అధికారులు కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదుఅలాగే తీరంలో మందుబాబులు అధికంగా వస్తుంటారు. వారిని కట్టడి చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.