ఏపీ అధికార్ల తాజాగా చేసిన ఓ పనితో ఇపుడు ప్రశంసలందుకొంటున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి.. కేవలం 39 నిమిషాల్లోనే కార్డు జారీ చేసి వైద్యం అందేలా చూశారు అధికారులు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణం ఫకీరుపేట వార్డు సచివాలయంలో వర్రి సింహాచలం వాలంటీర్‌గా పనిచేస్తున్నారు. అతడు సోమవారం బైక్‌పై వెళ్తుండగా.. మందస హైవే దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. సింహాచలంకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతడ్ని విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే సింహాచలంకు అప్పటి వరకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు. దీంతో ఉచితంగా చికిత్స చేయడం కుదరలేదు.
సింహాచలంది పేద కుటుంబం కావడంతో.. వైద్యం చేయించేందుకు కూడా డబ్బు లేని పరిస్థితి. వెంటనే బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఈ విషయాన్ని సీడాప్ చైర్మన్ శ్యామ్‌ప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా వెంటనే స్పందించి.. బాధితుడి వివరాలు అడిగి తీసుకున్నారు. ఆ వెంటనే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అడిషనల్ సీఈవోకు ఫోన్ చేసి వివరాలు చెప్పారు. సింహాచలంకు వెంటనే హెల్త్ కార్డు మంజూరు చేయాలని కోరారు.
శ్యామ్‌ప్రసాద్ రెడ్డి మధ్యాహ్నం 1.53కు ఆయన ఫోన్ చేస్తే కేవలం 39నిమిషాల్లో అంటే మధ్యా హ్నం 2.32కు ఆరోగ్య శ్రీ కార్డు సిద్ధమైంది. ఆ కార్డు సాయంతో అతడికి ఉచితంగానే కార్పొరేట్ వైద్యం అందింది. ఆరోగ్యశ్రీ కార్డు లేని విషయం తెలిసి.. వెంటనే స్పందించి తమకు సాయం చేసిన ప్రభుత్వానికి, అధికారులకు సింహాచలంతో పాటూ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.