బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీని వీడనున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నెల 26న జనసేన పార్టీలో చేరబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అక్కడితో ఆగలేదు.. లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని కూడా చెప్పుకుంటున్నారు. తనకు గ్రీన్ సిగ్నల్ రావడంతోనే జనసేనవైపు అడుగులు వేస్తున్నారని చర్చ నడుస్తోంది. అయితే కన్నా మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదు.
కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. చాలా రోజులుగా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఆ తర్వాత ఆసక్తికరంగా జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కన్నా ఇంటికి వెళ్లి మరీ కలిశారు. అప్పుడే జనసేన పార్టీలోకి వెళతారని ప్రచారం జరిగింది.. కానీ అలాంటిది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. అనంతరం కాపు నేతల సమావేశంలో కూడా కన్నా పాల్గొన్నారు. ఈ పరిణామాలన్నీ అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.
అంతేకాదు కన్నా జనసేన పార్టీలోకి వెళితే సత్తెనపల్లి సీటు ఇస్తారని ప్రచారం జరగడం వెనుక మరో లాజిక్ కూడా తెరపైకి వచ్చింది. టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటే.. జనసేనకు సత్తెనపల్లి సీటు ఇస్తారని.. అక్కడ కన్నా లక్ష్మీనారాయణ పోటీచేస్తే బావుంటుందనే అభిప్రాయాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆయనైతే బలమైన అభ్యర్థిగా ఉంటారని చెప్పుకుంటున్నారు. అలాగే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత ఆ నియోజకవర్గానికి టీడీపీ ఇంఛార్జ్‌ను నియమించలేదు. ఈ విషయాన్ని కూడా కొందరు గుర్తు చేస్తున్నారు.
మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయనపై బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని.. అది కన్నా లక్ష్మీనారాయణ అయితే బావుంటుందని భావిస్తున్నారట. అందుకే జనసేన పార్టీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరి కన్నా ఆ దిశగా అడుగులు వేస్తారా.. బీజేపీలోనే కొనసాగుతారా అన్నది చూడాలి.