టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు కడపలోని పెద్ద దర్గాను దర్శించుకోనున్నారు. ఇదిలావుంటే నారా లోకేష్ 'యువగళం' పాదయాత్రకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ నెల 27న కుప్పం నుంచి నడక ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో లోకేష్ యాత్రకు సంబంధించి షెడ్యూల్ ఇలా సాగబోతోంది. ఈ నెల 25న లోకేష్ హైదరాబాద్‌లో తన నివాసం నుంచి బయలుదేరి ఎన్టీఆర్ ఘాట్ చేరుకుంటారు. అక్కడ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి బయల్దేరి కడపకు వెళతారు.. అక్కడ పెద్ద దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.. అనంతరం మరియాపురంలోని కేథలిక్ చర్చిని సందర్శించి ప్రార్థనల్లో పాల్గొంటారు.
కడప నుంచి బుధవారం సాయంత్రం బయల్దేరి తిరుమలలోని జీఎంఆర్ అతిథి గృహంకు వెళతారు. రాత్రికి అక్కడే బస చేసి.. ఈ నెల 26న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకుంటారు. 27 నుంచి యువగళం పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభిస్తారు.
మరోవైపు నారా లోకేష్ కుప్పం నుంచి ప్రారంభించనున్న యువగళం పాదయాత్ర మూడు రోజుల పూర్తి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 27న తొలి రోజు కుప్పం పట్టణం వరదరాజస్వామి ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. మూడు రోజుల్లో 29 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగనుంది. మొదటి రోజు వరదరాజస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. పాదయాత్రలో భాగంగా సివిల్ కేసులు ఎదుర్కొంటున్న మహిళా కార్యకర్తలతో సమావేశం అవుతారు. అదే రోజు సాయంత్రం కమతమూరు మార్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ రోజు రాత్రి పీఈఎస్ వైద్య కళాశాల సమీపంలో బస చేస్తారు.
రెండో రోజు ఉదయం 8 గంటలకు పాదయాత్ర మొదలవుతుంది.. 8.10 గంటల నుంచి గంట పాటు యువతతో సమావేశంకానున్నారు. ఆ రోజు సాయంత్రం 5.55 గంటలకు పాదయాత్ర పూర్తవుతుంది. మూడో రోజు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.55 గంటలకు రామకుప్పం మండలం చెల్దిగానిపల్లెకు చేరడంతో కుప్పం నియోజకవర్గంలో పాదయాత్ర ముగియనుంది. ఆ తర్వాతి షెడ్యూల్ కూడా త్వరలో విడుదల చేయనున్నారు.
నారా లోకేష్ పాదయాత్ర 400 రోజుల పాటూ 4వేల కిలోమీటర్ల మేర కొనసాగనుంది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు యాత్ర షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ఇక అనుమతి విషయానికి వస్తే.. లోకేష్ పాదయాత్రకు చట్టప్రకారమే అనుమతిలిస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ అన్నారు. అనుమతివ్వబోమని తాము చెప్పలేదని.. ఆంక్షలు విధించం అన్నారు. ఈ యాత్రకు అనుమతి కావాలని ఇప్పటికే టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారని.. దానిపై పలు వివరణలు కోరుతూ ఆయన సమాధానమిచ్చారన్నారు. చంద్రబాబు పీఏ మనోహర్, మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి కూడా యాత్రకు అనుమతి కోరుతూ తమకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇవాళ అనుమతిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా లోకేష్ పాదయాత్ర జరుగుతుందని టీడీపీ నేతలు తేల్చి చెబుతున్నారు.