ఏపీలో రేషన్ కార్డు ఉన్నవాళ్లకు రాష్ట్రంలోని మొత్తం 16 మున్సిపాలిటీల పరిధిలో ఉన్న సుమారు 7 లక్షల బియ్యం కార్డుదారులకు ఫిబ్రవరి నుంచి రాయితీపై గోధుమపిండి అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక్కో రేషన్ కార్డుపై నెలకు 2 కిలోల గోధుమపిండిని.. కిలో రూ.16 చొప్పున పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. తర్వాత రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కార్డుదారులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
మరోవైపు త్వరలో రాగులు, జొన్నలను కూడా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్‌కార్డుదారులకు ఇస్తున్న ఉచిత బియ్యంలో 2 కేజీలు తగ్గించి.. వాటి స్థానంలో రాగులు, జొన్నలను రాయితీపై పంపిణీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయించగా, ఎక్కువ మంది రాగులు, జొన్నలు తీసుకుంటామని తెలిపారు. త్వరలో రాయలసీమ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పంపిణీ మొదలుపెట్టనున్నారు. దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు రాగులు, జొన్నలు పంపిణీ చేస్తారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరిస్తున్నాం.. రైతులకు మద్దతు ధర ప్రకటించి అమలు చేశామని ఇటీవలే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. 21 రోజులల్లోపే ధాన్యం సేకరణకు సంబంధించి సొమ్ములు చెల్లిస్తున్నామన్నారు. అలాగే కందిపప్పు బాగోలేదని చాలా మంది ఫిర్యాదు చేశారని.. బండి దగ్గరే కందిపప్పును ఉడకబెట్టి నాణ్యత పరిశీలించాలని ఆదేశించినట్లు చెప్పారు.