ఎపుడూ వినూత్నంగా ఆలోచించే ప్రధాని నరేంద్ర మోడీ ఈ సారి కూడా అదే తరహాలో ఆలోచించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన ‘పరాక్రమ్ దివస్’సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అండమాన్ నికోమార్‌లో 21 దీవులకు 21 మంది సైనికవీరుల పేర్లు పెట్టారు. ఈ 21 మంది కూడా ‘పరమ్ వీర్ చక్ర’ గ్రహీతలు కావడం విశేషం. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటివరకూ పేర్లు లేని దీవులకు.. పరిమాణంలో పెద్ద నుంచి చిన్న క్రమంలో వరుసగా తొలి పరమ్‌వీర్ చక్రతో మొదలుకొని 21 మంది వీరుల పేర్లు పెట్టారు. అంతేకాకుండా.. 2018లో రాస్ ఐలాండ్స్ పేరును ప్రధాని మోదీ ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్’గా నామకరణం చేశారు. ఇప్పుడు అక్కడ నేతాజీ గౌరవార్థం ఒక జాతీయ స్మారకం నిర్మించాలని తలపెట్టారు. ఈ స్మారకం నమూనాను మోదీ ఆవిష్కరించారు.
‘ఈ అండమాన్ గడ్డ మీదే మొదటిసారి భారత త్రివర్ణపతాకం రెపరెపలాడింది. స్వతంత్ర భారతదేశానికి చెందిన ప్రభుత్వం మొదట ఇక్కడే ఏర్పాటైంది. ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఈ రోజును దేశం పరాక్రమ్ దివస్‌గా నిర్వహిస్తోంది’ అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు.
‘ఈ 21 మంది సైనికవీరులకు దేశమే అన్నింటి కంటే ముఖ్యం. ఆ తర్వాతే మిగతాది. వారికి ఈ పేర్లు పెట్టడం ద్వారా వారి సంకల్పం ఎప్పటికీ నిలిచి ఉండేలా చేశాం. ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మొదలుకొని భారత సైన్యం పరాక్రమం వరకు ప్రతిబింబిస్తుంది’ అని మోదీ అన్నారు. సోమవారం (జనవరి 23) ఉదయం వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.