కర్ణాటకలో వినూత్నంగా సంచార దహన వాటికను ప్రారంభించారు. ఇంటి వద్దే అంతిమ సంస్కారాలు నిర్వహించేలా ఓ పరికరాన్ని తయారు చేయగా.. అది అందుబాటులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకోలని తీర ప్రాంత జిల్లాల్లోని పలు గ్రామాల్లో సరైన రహదారులు లేవు, ఇక ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. భారీ వర్షాల సమయంలో మార్గం మొత్తం నీటిలో మునిగి ఉండటంతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అక్కడి ప్రజలు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. కరోనా సమయంలో తీర ప్రాంత జిల్లాలోని ఓ గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే పెరట్లోనే దహన సంస్కారాన్ని నిర్వహించాల్సి వచ్చిందంటే అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ ఇబ్బందుల నేపథ్యంలో ఉడిపి జిల్లాలోని బైందూరు నియోజకవర్గంలోని ముడూరు వ్యవసాయ సహకార సమితి రూ. 5.8 లక్షలతో కొత్త పరికరాన్ని తయారు చేయించింది. 7 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తుతో పర్యావరణ హితంగా పరికరాన్న తయారు చేయించారు. కేరళకు చెందిన స్టార్ ఛైర్ సంస్థ దీన్ని తయారు చేసింది. ఎవరైనా చనిపోతే తీర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇంటి వద్దకే ఈ పరికారన్ని తీసుకువచ్చి దహన సంస్కారాలు నిర్వహించచ్చు.
ఈ పరికరం విద్యుత్తు, గ్యాస్ రెండింటితోనూ పని చేస్తుందని... ఒక మృత దేహాన్ని దహనం చేసేందుకు 10 కిలోల గ్యాస్, 100 గ్రాముల కర్పూరం అవసరమవుతుందని వ్యవసాయ సహకార సమితి అధ్యక్షుడు విజయశాస్త్రి స్పష్టం చేశారు. శవదహన సమయంలో ఎవరికీ కనపడకుండా పైన ఒక డోమ్‌ను అమర్చుకునే సదుపాయం ఉంటుంన్నారు. గ్యాసు, విద్యుత్తుతో పని చేయడంవల్ల కాలుష్యం ఉండదని, చక్రాలు అమర్చడంవల్ల ఎక్కడికైనా తేలికగా తరలించుకోవచ్చని వివరించారు. కొద్ది నిమిషాల్లోనే దహన ప్రక్రియ పూర్తవుతుందని విజయశాస్త్రి వెల్లడించారు.
బూడిద, ఇతర అవశేషాలు కింద ఒక పేటికలోకి చేరతాయని.., వాటిని నిమజ్జనం నిమిత్తం మృతుల కుటుంబ సభ్యులకు అందిస్తామని అన్నారు. కర్ణాటకలో ఇలాంటి సంచార శ్మశానాన్ని వినియోగించడం ఇదే తొలిసారి కాగా.. దానికి 'సంచార శ్మశానం' అని పేరు పెట్టారు. రవాణా, దహన సంస్కారానికి అయ్యే ఖర్చును ముడూరు వ్యవసాయ సహకార సమితే భరిస్తోంది.