పులివెందులకు భారీ స్థాయిలో భద్రతా బలగాలు చేరుకొన్నాయి. కారణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం సంభవించడమే. వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా? అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పులివెందుల నియోజకవర్గం మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది. పులివెందుల వెళ్లేందుకు అదనపు భద్రత కావాలని సీబీఐ ఉన్నతాధికారులు కడప ఎస్పీని కోరారు. విచారణకు హాజరయ్యేందుకు అవినాష్ రెడ్డి ఐదురోజుల సమయం కోరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే కడప నుంచి పులివెందులకు బయలుదేరారు. అక్కడ ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయో తెలియక అదనపు భద్రత కల్పించాలంటూ ఎస్పీని కోరారు. భారీ సంఖ్యలో భద్రతా దళాలు పులివెందులకు చేరుకుంటున్నాయి.
హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11.00 గంటలకు విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి జారీచేసిన నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో నోటీసులను ఆయన పీఏ రాఘవరెడ్డికి ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండున్నర సంవత్సరాల నుంచి కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులివ్వడం ఇదే తొలిసారి.
నిన్న పులివెందులలో అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆరా తీశారు. భాస్కర్ రెడ్డి ఇంటిదగ్గర లేకపోవడంతో వైసీపీ కార్యాలయానికి వెళ్లి అడిగారు. అప్పటికే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా కార్యాలయంలోనివారు సమాచారం ఇచ్చారు. అరగంట సమయం అక్కడే వేచిచూడగా అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి వచ్చి అధికారులతో మాట్లాడారు. తన సెల్ ఫోన్ నుంచి ఎవరికో ఫోన్ చేసి ఇవ్వగా మాట్లాడిన అధికారులు కొన్ని వివరాలను సేకరించారు. తర్వాత నోటీసును రాఘవరెడ్డికి అందజేసి వెళ్లిపోయారు. ఈ విషయం రాష్ట్రంలో సంచలనంగా మారింది.