జగన్ సర్కారు హిందూ వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలోని అన్ని వనరులను దోచుకుంటున్నారని వారు ఆరోపించారు. . రాష్ట్రంలో హిందూ ఆలయాల హుండీ ఆదాయాన్ని ఇతర మతాలకు పంచి పెడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో కీలక నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏపీ బీజేపీ కో ఇన్‌చార్జి సునీల్ దియోధర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న రెండు కుటుంబ పార్టీలను ఓడించడానికి బీజేపీ కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీలో తాము పొత్తులోనే ఉన్నామని వెల్లడించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందన్నారు. జగన్ పాలన చూస్తుంటే చంద్రబాబు పాలన నుంచి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి మారిందన్నారు. ఇక, పోరు యాత్ర-2 పేరుతో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెండు కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయబోతున్నట్లు సునీల్ దియోధర్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టానికి కృషిచేస్తామని వెల్లడించారు.