గ్రామ సచివాలయ వ్యవస్ధపై ఉత్తరప్రదేశ్ సీఎం స్పెషల్ అడ్వైజర్ సాకేత్ మిశ్రా ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వ్యవస్థ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో.. సాకేత్ మిశ్రా సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన సాకేత్ మిశ్రా.. సీఎం జగన్‌తో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్ధపై మిశ్రా ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వ్యవస్థ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు.
'ఏపీ పర్యటన మంచి అనుభవాన్ని ఇచ్చింది. ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమాన్ని చూసి చాలా నేర్చుకోవచ్చు. క్షేత్రస్ధాయిలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని.. మెరుగుపరుస్తున్న తీరును స్వయంగా పరిశీలించాను. చివరి వ్యక్తికి కూడా వీటిని అందించడానికి సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించక తప్పదు. ఇలాంటి కార్యక్రమాల వెనుక లక్ష్యాలు, ఉద్దేశాలపై ముఖ్యమంత్రితో చర్చించాను. చివరి పేద వ్యక్తికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలన్నదే తన ఉద్దేశం అని సీఎం జగన్ చెప్పారు' సాకేత్ మిశ్రా వివరించారు.
'ప్రజలకు వైద్య సేవలు అందించడానికి.. వారి ఆరోగ్య చరిత్రను నిక్షిప్తం చేయడం తదితర కార్యక్రమాలను సమన్వయం చేయడం మంచి పరిణామం. ఈ కార్యక్రమాలు సజావుగా నడవటానికి ఐటీ, సహా ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం బాగుంది. గ్రామ సచివాలయ వ్యవస్ధ అనేది ఒక విప్లవాత్మకమైన, గొప్ప కాన్సెప్ట్. ఏపీలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలి. దీనివల్ల వీటిలో మెరుగైన అంశాలను ఇతర రాష్ట్రాలు తీసుకుని.. వాటి నుంచి లబ్ధిపొందేందుకు అవకాశం ఉంటుంది' అని మిశ్రా వ్యాఖ్యానించారు.