పుట్టపర్తి: ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి ఇచ్చిన హామీలను ప్రధాని నరేంద్ర మోడీ విస్మరించి రైతాంగాన్ని దగా చేశారని రైతుసంఘాల సమన్వయ సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు బిజెపి చేసిన మోసాన్ని నిరసిస్తూ రైతుసంఘాల ఆధ్వర్యంలో గురువారం ఉదయం మామిళ్లకుంట క్రాస్ నుంచి పుట్టపర్తిలోని గణేష్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష రైతు సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జంగాలపల్లి పెద్దన్న, బడా సుబ్బిరెడ్డి, కాటమయ్య, జెవి. రమణ తదితరులు మాట్లాడారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా మోడీ ప్రభుత్వం రాతపూర్వక ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరించిందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి అన్ని పంటలకూ మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మద్దతు ధరలు రైతులకు అందేలా మద్దతు ధరల గ్యారెంటీ చట్టం వెంటనే తేవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరలకు చట్టబద్దత లేక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించకపోవడంతో జిల్లాలో రైతులు పంటలకు పెట్టుబడులు కూడా రాక సాగు గణనీయంగా తగ్గిందన్నారు. దేశవ్యాప్తంగా రైతులు వ్యవసాయ నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేట్ కంపెనీలకు రుణమాఫీ చేస్తున్న మోడీ ప్రభుత్వం రైతుల పంట రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం తీసుకువచ్చి రైతుల పంట రుణాలు మాఫీ చేయాలని కోరారు. కేంద్ర విద్యుత్ సవరణ-2020 బిల్లును రద్దు చేయాలని, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపు ఆపాలన్నారు. సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు.
ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. రైతులపై బరాయించిన అక్రమ కేసులు రద్దు చేయాలన్నారు. కౌలు రైతులందరికీ సిసిఆర్సి కార్డులు ఇచ్చి బ్యాంకు రుణాలు పంట నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. జిల్లాలో రైతుల పంటలను రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలులో చేయాలన్నారు ఈ సమస్యలపై కేంద్రం స్పందించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘాల నాయకులు సోము కుమార్, నర్సాగౌడ, సిఆర్. రెడ్డి, శ్రీరాములు, శంకర్ రెడ్డి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్. వెంకటేష్, లక్ష్మీనారాయణ, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు కదిరప్ప, పైపల్లి గంగాధర్, పెడవల్లి బాబా, గౌస్ లాజం పాల్గొన్నారు.