పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించేందుకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధమని అలానే , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ స్పష్టం చేశారు. పుంగనూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును పుంగనూరులో పోటీ చేయాలని, లేకుంటే కుప్పంలో ఓడిస్తానని మంత్రి పెద్దిరెడ్డి సవాలు విసిరినట్లు మీడియాలో చూశానన్నారు. 2024లో పుంగనూరులోనే పెద్దిరెడ్డి కుటుంబసభ్యులు కాకుండా ఆయన పోటీ చేస్తే ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హంద్రీనీవా కాల్వ పనులు, పుంగనూరులో సమ్మర్ స్టోరేజీట్యాంకును దాదాపు రూ.50 కోట్లతో నిర్మించి కాంట్రాక్టర్ బిల్లులు చేసుకోవడం తప్ప ప్రజలకు లీటరు నీళ్లు ఇచ్చిన పాపానపోలేదని ఆరోపించారు. పుంగనూరు ప్రాంతంలో వలసలు అధికంగా ఉన్నాయని, కనీసం 200 మందికి జీవనోపాధి కోసం ఒక్కపరిశ్రమ, ఇంజనీరింగ్ కాలేజీలు మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ వస్తే దాన్ని పుంగనూరుకు తీసుకురాకుండా వారి బినామీ భూములకు విలువ పెరగాలని మదనపల్లెకు తరలించిన ఘనత పెద్దిరెడ్డికే దక్కుతుందన్నారు. పుంగనూరులో అరాచకాలను కేంద్రహోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లగా వైప్లస్ కేటగిరి భద్రత కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట ఆర్సీవై టీం ప్రతినిధులు సాంబమూర్తి, ఆనంద్, అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.