ఇద్దరు కోర్టు ఉద్యోగులు మోటార్‌సైకిల్‌పై విధులకు వెళుతుండగా నెల్లూరు జిల్లా, మనుబోలు-పొదలకూరు మార్గంలోని వీరంపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వీపర్ కాకి మరియమ్మ (40) దుర్మరణం చెందింది. పోలీసుల కథనం మేరకు కలువాయి దళితవాడకు చెందిన కాకి మరియమ్మ కొన్నేళ్లుగా గూడూరు కోర్టులో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు కోర్టుకు ముందుగా వెళ్లి శుభ్రం చేసి ముగ్గులు వేయాలని మరియమ్మ కలువాయి నుంచి పొదలకూరుకు చేరింది. బస్సులు అందుబాటులో లేకపోవడంతో అదే కోర్డులో ప్రాసెసింగ్ సర్వర్‌గా పనిచేస్తున్న నెల్లూరు జ్యోతినగర్‌కు చెందిన సాయిదినేష్‌కు సమాచారం తెలిపింది. దీంతో అతను నెల్లూరు నుంచి మోటార్‌సైకిల్‌పై పొదలకూరు చేరుకుని మరియమ్మను ఎక్కించుకొని మనుబోలు మీదుగా గూడూరుకు బయలుదేరారు. వీరంపల్లి సమీపంలో నాయుడుపల్లి మలుపువద్ద గూడూరు నుంచి పొదలకూరుకు సవకకర్రల లోడుతో వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ను ఢీకొంది. దీంతో మరియమ్మ ఎగిరి రోడ్డుపై పడగా ఆమె తల లారీ చక్రాల కింద నలిగి దుర్మరణం చెందింది. సాయిదినేష్ హెల్మెట్ ధరించి ఉండడంతో స్వల్ప గాయాలయ్యాయి. అతడిని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్‌ఐ. ముత్యాలరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. శవపరీక్ష నిమిత్తం మరియమ్మ మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.