తిరుమల తిరుపతి దేవస్థానం మొబైల్ యాప్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. జియో సహకారంతో రూపొందించిన నూతన టీటీడీ యాప్‌ను ఈవో ధర్మారెడ్డితో కలిసి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా భక్తులకు వన్‌స్టాప్ విధానంలో సేవలు అందిస్తామని చెప్పారు. వర్చువల్ సేవలను భక్తులు ఈ యాప్ ద్వారా వీక్షించవచ్చని వివరించారు. అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ యాప్ ద్వారా కూడా విరాళాలు అందించవచ్చన్నారు. భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా శ్రీటీటీదేవస్థానం పేరుతో రూపొందించిన మొబైల్ యాప్‌ను ప్రారంభించిన అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. భక్తుల కోసం ఇప్పటివరకు గోవింద మొబైల్ యాప్ ఉండేదని, దీన్ని మరింత ఆధునీకరించి మరిన్ని అప్లికేషన్లు పొందుపరచి నూతన యాప్‌ను రూపొందించామని తెలిపారు. ఈ మొబైల్ యాప్ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్ చేసుకోవచ్చన్నారు. విరాళాలు కూడా ఇదే యాప్ నుంచి అందించవచ్చని చెప్పారు. పుష్ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చని, ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ యాప్ ద్వారా చూడవచ్చని తెలిపారు.