శ్రీకాకుళం నగర పరిధి శాంతినగర్ కోలనీ వద్దగల బలగ ప్రధాన నీటి సరఫరా కేంద్రం నుండి డే అండ్ నైట్ బ్రిడ్జి వరకు నాగావళి నదీ తీరానికి రక్షణ గోడ వెంటనే నిర్మించాలని, సబ్ సర్ఫేస్ డైక్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు చల్లా వెంకటేశ్వర రావు ప్రభుత్వానికి డిమాండ్ చేసారు. నాగావళి నదిలో స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న సబ్ సర్ఫేస్ డైక్ నిర్మాణాన్ని బిజెపి శ్రీకాకుళం అసెంబ్లీకి చెందిన నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. శ్రీకాకుళం నగరానికి వరద ముప్పు రాకుండా, గతంలో ఇక్కడ రక్షణగా ఇసుక దిబ్బలు ఉండేవని, నగరానికి మంచినీటి సరఫరా కోసం ఇక్కడ సబ్ సర్ఫేస్ డైక్ నిర్మాణం చేపట్టారని, రక్షణ గోడ నిర్మాణ చేయకుండా డైక్ (ఆనకట్ట) నిర్మాణం చేయడం కారణంగా, వరద నీటి ప్రవాహ ఉధృతికి, ప్రకృతి పరంగా ఏర్పడిన ఇసుకదిబ్బలు కొట్టుకు పోయాయని ఆరోపించారు. దీని మూలంగా డైక్ నిర్మాణం కొట్టుకుపోవడమే కాకుండా, సమీపంలోని ప్రైవేటు పాఠశాల ప్రహరీతో పాటు కొంత ప్రాంగణం, నదిలో ఉన్న బలగ ప్రధాన నీటి సరఫరా కేంద్రానికి చెందిన ఊట బావులు ప్రవాహంలో కొట్టుకుపోయి, నదీ ప్రవాహం దిశ మారిపోయిందని ఆరోపించారు. సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణంలో ఉన్న డైక్ కొట్టుకుపోయిందని ఆరోపించారు. దీని కారణంగా శ్రీకాకుళం నగరానికి వరదముప్పు పొంచి ఉందని అన్నారు.
నగర ప్రజలకు త్రాగునీరు సరఫరాకు ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతో డైక్ నిర్మాణం మళ్ళీ చేపట్టారని, కానీ శాశ్వత రక్షణ గోడ నిర్మాణం చేయనందు వలన మరోసారి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. 5. 5 కోట్ల రూపాయలతో రక్షణ గోడ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపినా కూడా, ప్రభుత్వం నుండి స్పందన లేదని అన్నారు. మడ్డువలస రిజర్వాయరు షట్టర్ల రిపేర్ల కోసం, రిజర్వాయరులోని నీటిని ఈ నెల 15 నుండి నెల రోజులపాటు విడిచిపెడుతున్నారని, దీనివలన డైక్ నిర్మాణం లేటు అవ్వడమే కాకుండా, 52 లక్షల రూపాయలతో ఇసుక బస్తాలతో నిర్మించిన తాత్కాలిక రక్షణ గోడ కొట్టుకుపోయే అవకాశం ఉండడమే కాకుండా, ప్రజల త్రాగునీటి సరఫరాకు ఇబ్బంది ఏర్పడుతుందని అన్నారు. కార్పొరేషన్ అధికారుల ప్రణాళిక లేని నిర్ణయాల కారణంగా, ప్రభుత్వం నుండి నిధులు రప్పించడంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధుల వైఫల్యం కారణంగా, కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని చల్లా వెంకటేశ్వర రావు ఆరోపించారు.
మాస్టర్ ప్లాన్ ప్రకారం, బలగ ప్రధాన నీటి సరఫరా కేంద్రం నుండి, రిమ్స్ కాలేజీ మీదగా నాగావళి నదిని ఆనుకుని ఉండాల్సిన 100 అడుగుల రోడ్డును సర్వే చేయించి, ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఆక్రమణలపై విచారణ చేయాలని, జిల్లా కలెక్టర్ ఆదేశించి సంవత్సరం దాటిపోతున్నా, మున్సిపల్ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో చల్లా వెంకటేశ్వర రావుతో పాటు బిజెపి జిల్లా కార్యదర్శి గంగు శ్రీదేవి, ఇప్పిలి సీతరాజు, సాధు కిరణ్ కుమార్, చిట్టి తవుడు, మూకళ్ళ లక్ష్మీనారాయణ, రావాడ పురుషోత్తం, బలగ సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.