సింధు నదీ జలాల ఒప్పందాన్ని సవరించుకుందా అంటూ పాకిస్తాన్ కు భారత ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇదిలావుంటే సింధు నదీ జలాలపై భారత్, పాకిస్థాన్‌ల మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య విబేధాలలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని సవరించుకుందామంటూ దాయాదికి నోటీసు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. సింధు జలాల ఒప్పంద కమిషనర్ల ద్వారా జనవరి 25న ఈ నోటీసు పంపినట్లు తెలిపాయి. ఈ ఒప్పందం అమలుపై పాక్ మొండి వైఖరి కారణంగానే నోటీసు పంపించాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
‘‘సింధు నదీ జలాల ఒప్పందాన్ని స్ఫూర్తితో అమలు చేసే విషయంలో భారత్ ఎల్లప్పుడూ కృతనిశ్చయంతో, బాధ్యతతో వ్యవహరిస్తోంది.. కానీ, ఒప్పందం నిబంధనలు, అమలుకు పాక్ చర్యలు ఆటంకం కలిగిస్తున్నాయి.. ఫలితంగా ఒప్పందాన్ని సవరించుకునేందుకు భారత్ ఇప్పుడు బలవంతంగా నోటీసు జారీ చేయాల్సి వచ్చింది’’ అని అధికార వర్గాలు వెల్లడించాయి. ఒప్పందానికి సంబంధించిన నోటీసు పంపడంతో 90 రోజుల్లోగా భారత్, పాక్ మధ్య చర్చలు నిర్వహించాల్సి ఉంటుంది.
అంతేకాదు, గత ఆరు దశబ్దాల్లో నేర్చుకున్న పాఠాలతో ఈ ఒప్పందాన్ని (ఐడబ్ల్యూటీ) సవరించుకునేందుకు వీలు లభించినట్టవుతుంది. కిషన్‌గంగా, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో విభేదాల పరిష్కారానికి చర్చలను గత ఐదేళ్లుగా పాక్ నిరాకరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఈ నోటీసును పంపాల్సి వచ్చిందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. వాటి పరిశీలనకు తటస్థ నిపుణులు అవసరమని 2015లో పాకిస్థాన్ అభ్యర్థించింది. అయితే ఆ తర్వాత ఏడాదే దానిని వెనక్కి తీసుకుంది. మధ్యవర్తిత్వ న్యాయస్థానం తమ అభ్యంతరాలను పరిష్కరించాలని ప్రతిపాదించింది.
ఇదిలావుంటే క్ చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన భారత్.. ఈ వ్యవహారాన్ని తటస్థ నిపుణులకు అప్పగించాలని ప్రపంచ బ్యాంక్‌కు విన్నవించింది. ఈ వివాదంపై 2016లో స్పందించిన ప్రపంచ బ్యాంకు.. ఇరు దేశాల అభ్యర్థనలను నిలిపివేసింది. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని అన్వేషించాలని సూచించింది. అయితే, పాక్ ఒత్తిడి చేయడంతో ఇటీవల తటస్థ నిపుణుడి అభ్యర్థన, మధ్యవర్తిత్వ కోర్టు ప్రక్రియ రెండింటిని ప్రపంచ బ్యాంకు ప్రారంభించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన భారత్.. ఒకే అంశంపై రెండు సమాంతర చర్యలు చేపట్టడం సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని మండిపడింది. ఇలాంటి ఉల్లంఘనల కారణంగానే ఒప్పందం సవరణకు నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
దేశ విభజన అనంతరం సింధు నదీ జలాల వివాదానికి పరిష్కరించుకునేందుకు భారత్, పాక్ మధ్య 1960 సెప్టెంబరు 19న ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై నాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. తొమ్మిదేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్ పాక్‌కు, రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్‌కు దక్కాయి. రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు ‘సింధు శాశ్వత కమిషన్’ ఏర్పాటు చేశారు. దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు.