ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేంజ్ రోవర్ వాహనంలో వచ్చిన ప్రధాని....దానిపై తాజాగా చర్చ

national |  Suryaa Desk  | Published : Fri, Jan 27, 2023, 09:44 PM

ప్రధాని నరేంద్ర మోడీ వేసుకొనే దుస్తుల నుంచి వాడే వాహనం వరకు ఇపుడు ప్రతిదీ చర్చాంశనీయంగా మారుతోంది. ఇదిలావుంటే 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. బ్లాక్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీలో వచ్చారు. కర్తవ్యపథ్‌లో జాతీయ యుద్ధ స్మారకం వద్ద సైనిక అమరవీరులకు నివాళి అర్పించే గణతంత్ర దినోత్సవ పరేడ్ ప్రాంతానికి హై సెక్యూరిటీ మధ్య చేరుకున్నారు. వేడుకలకు హాజరైన వారికి అభివాదం చేస్తూ కర్తవ్యపథ్ మార్గంలో ప్రధాని మోదీ.. రేంజ్ రోవర్ వాహనశ్రేణిలో వస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్లు, అత్యంత పకడ్బందీ భద్రత ఉండే ఈ రేంజ్ రోవర్ కారు గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.


రేంజ్ రోవర్ సెంటినెల్ ఎస్ యూవీ అనేది టాటా మోటార్స్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన ‘ల్యాండ్ రోవర్’ ఉత్పత్తి. ఎస్‌యూవీ తరహాకు చెందిన ఈ ప్రత్యేక రకమైన కారును.. అందులో ప్రయాణించే వారికి పటిష్ట భద్రత, రక్షణను అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించారు.


ఈ వాహనం ప్రత్యేకతలు ఇలావున్నాయి.  ఇదొక ఆల్-టెర్రైన్ వెహికల్‌. అంటే ఏ రహదారిపై అయినా, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా నడుస్తుంది. కేవలం 10.4 సెకన్లలో 0 నుంచి 100  కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలగడం ఈ వాహనం ప్రత్యేకత. దీని గరిష్ట వేగం 193 కిలోమీటర్లు. రేంజ్ రోవర్ సెంటినెల్ SUVలో 5.0 లీటర్ సూపర్ ఛార్జ్‌డ్ V8 ఇంజిన్ అమర్చారు. ఇంతకుముందు వాడే వీ6 మోడల్ కంటే ఇది 40 బీహెచ్ పీ అధిక శక్తిని అందిస్తుంది. కారు బాడీని ఎలాంటి దాడుల నుంచైనా రక్షణ కల్పించేందుకు వీలుగా కఠినమైన పదార్థంతో, బలంగా రూపొందించారు. అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని నిర్మించారు. బాలిస్టిక్, బాంబ్ దాడుల నుంచి కూడా ఇది రక్షణ కల్పిస్తుందని తయారీదారులు వెల్లడించారు. వాహనం బాడీ ఆధునిక తరహా, అసాధారణ దాడుల నుంచి కూడా తట్టుకునేలా రూపొందించారు. ఐఈడీ  పేలుళ్ల నుంచి కూడా రక్షణ ఉంటుంది.  అదనపు రక్షణ కోసం ఈ వాహనానికి ఆర్మర్డ్ గ్లాస్  లాంటి అధునాతన భద్రతతో కూడిన పార్ట్స్‌ను ఉపయోగించారు. భద్రత ప్రమాణాలకు ఇబ్బంది లేకుండా, వాహనం వెలుపల వ్యక్తులతో కమ్యూనికేట్ చేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్సల్ సిస్టమ్ కూడా ఉండటం ఈ వాహనం అదనపు ప్రత్యేకత. సైరన్, ఎమర్జెన్సీ లైటింగ్ ప్యాక్‌లు అదనపు ఫీచర్లు. వాహనం లోపలి భాగాన్ని కూడా సరికొత్త సాంకేతికత, అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు. ఈ వాహనం సరికొత్త ‘టచ్ ప్రో డ్యుయో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌’తో అమర్చి ఉంది. వాహనంలో 10 అంగుళాల హై-రిజల్యూషన్ టచ్ స్క్రీన్‌లు రెండు ఉన్నాయి. ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ యూజర్ ఫ్రెండ్లీగా, సహజంగా ఉంటుంది. ఇది వాహనం నావిగేషన్, ఉష్ణోగ్రత నియంత్రణ లాంటి వాటిని నియంత్రించడంతో పాటు వినోదానికి సంబంధించిన ఫీచర్లను కూడా ఆపరేట్ చేస్తుంది.  అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ వాహనం ఒక టన్ను బరువు ఉంటుంది.


అత్యాధునిక భద్రతా ప్రమామాణాలతో కూడిన ఈ రేంజ్ రోవర్ ఎస్‌యూవీ ధర రూ. 10 కోట్లకు పైగా ఉంది (భారత్‌లో ఎక్స్ షోరూమ్ ధర). ప్రధాని మోదీ కాన్వాయ్‌లో ఇలాంటివి 25కు పైగా వాహనాలు ఉంటాయి. కాన్వాయ్‌లో మొత్తం 30 నుంచి 35 వాహనాలు ఉంటాయి. 


 ప్రధాని లాంటి వీవీఐపీలకు ఇది బాగా నప్పే వాహనం అని నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. ఇది అత్యంత అధునాతనమైన సాంకేతికతతో కూడిన సురక్షితమైన వాహనమే కాకుండా, భారత్‌లోని అన్ని ప్రదేశాల్లో నడిపేందుకు అనువుగా ఉంటుందని తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com