వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ కోటిలోని సీబీఐ కార్యాలయంలో హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో టెన్షన్ నెలకొంది. అవినాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నించడం ఇదే మొదటిసారి కావడం, ప్రశ్నిస్తున్నది కూడా ముఖ్యమంత్రి జగన్‌కు వరుసకు సోదరుడు అవినాష్ రెడ్డి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 24నే విచారణకు రావాలని అంతకుముందురోజు సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా ఐదు రోజుల తర్వాత విచారణకు రాగలనని ఎంపీ బదులిచ్చారు. దీంతో ఈ నెల 25న పులివెందులకు వచ్చిన సీబీఐ అధికారులు విచారణకు రావాలని మళ్లీ నోటీసు ఇచ్చారు.