రిటైర్మెంట్ వయసు పెంపు అంటూ చక్కర్లు కొడుతున్న జీవో ఫేక్ అని ఏపీ సర్కార్ స్పష్టంచేసింది. ఇదిలావుంటే ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచిందంటూ జీవో ఒకటి వైరల్ అవుతోంది. అందులో రిటైర్మెంట్ వయసు 62 నుంచి 65కు పెంచారంటూ ఉంది. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులతో సహా అందరూ ఉలిక్కిపడ్డారు. కానీ ఆ తర్వాత అసలు ట్విస్ట్ బయటపడింది.. అది ఫేక్ జీవోగా తేలింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది.. ఆ వార్తలను ఖండించింది. ఉద్యోగుల రిటైర్మెంట్‌కు సంబంధించి ఆర్థికశాఖ పేరుతో సర్క్యులేట్ అవుతున్నదని ఫేక్ జీవో అని తెలిపింది.
ఉద్యోగుల రిటైర్మెంట్‌పై ఎలాంటి జీవో జారీ చేయలేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. అది జీవో ఒరిజినల్ కాదని.. దీన్ని ఎవరు వైరల్ చేశారో ఆరా తీస్తున్నారు. ఈ ఫేక్ జీవో వైరల్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే దీనిని క్రియేట్ చేసినవారిపై క్రిమినల్ కేసులు పెడతామంటున్నారు. అలాగే ఈ జీవోను సర్కులేట్ చేస్తున్నవారిపై గుంటూరు డీఐజీకి ఆర్థిక శాఖ అధికారుల ఫిర్యాదు చేశారు. గతంలోనే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు. అయితే మరోసారి ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 నుంచి 65 పెంచినట్లు ఫేక్ జీవోను వైరల్ చేశారు.. దీంతో ప్రభుత్వం స్పందించి క్లారిటీ ఇచ్చింది.