కొన్ని ప్రేమ కథలుకు పెళ్లికి ముందే శుభం కార్డు పడుతుంది. కొన్ని ప్రేమలు పెళ్లి దాక వచ్చేందుక కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇదిలావుంటే ఆంధ్ర అబ్బాయి అమెరికా అమ్మాయిల పెళ్లి.. యూకే అబ్బాయి ఆంధ్ర అమ్మాయిల ప్రేమ. ఇటీవల కాలంలో ఇలా ఎన్నో ప్రేమ కథల గురించి మనం వింటూనే ఉన్నాం. దేశాలు, ఖండాంతరాలు దాటి మరీ ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కానీ ఈ ప్రేమకథ మాత్రం అలా కాదు. ఆంధ్రా అబ్బాయి.. మలేషియా అమ్మాయిల మధ్య ఆస్ట్రేలియాలో ప్రేమ చిగురించింది. కానీ పెళ్లికి మాత్రం 12 ఏళ్ల సమయం పట్టింది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా.. అవునే నిజమే.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని వేడంగికి చెందిన కోట సూర్యప్రకాశరావు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం 15 ఏళ్ల క్రితం విశాఖ వచ్చి స్థిరపడ్డారు.. ఆయన మూడో కుమారుడు భవానీప్రసాద్. 13 ఏళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ మలేషియాకు చెందిన ఐక్‌వేతో పరిచయం ఏర్పడింది.. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. ఇంట్లో పెద్దలకు మనసులో మాట చెప్పారు.
ఈ పెళ్లికి ఐక్‌వే తరఫున వారు మాత్రం అంగీకరించలేదు.. దీంతో ఆమె తాను పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని చెప్పింది. ఇటు భాను ప్రసాద్ కూడా అదే నిర్ణయం తీసుకున్నారు.. ఇద్దరూ మంచి స్నేహితులుగానే ఉండిపోయారు. బాను, ఐక్‌వేలుఎం.ఎస్., పీహెచ్‌డీలు పూర్తి చేశారు.. అక్కడే ఉద్యోగాల్లో చేరారు. ఆ తర్వాత భవానీ ప్రసాద్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పి.. సొంతంగా వ్యాపారం ప్రారంభించారు.
ఐక్‌వే కూడా తన ఉద్యోగం మానేసి.. భాను సంస్థలో చేరి వ్యాపార వ్యవహారాలు చూస్తున్నారు. ఇలా 12 ఏళ్లు గడిచిపోయాయి.. ఇద్దరికీ 41 ఏళ్లు వచ్చాయి. అయితే ఇటీవలే ఐక్‌వే కుటుంబసభ్యులు పెళ్లికి ఓకే చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నడుమ హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇలా 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత వివాహబంధంతో ఒక్కటైంది ఈ జంట.