చలిదంచికొడుతున్న వేళ ఏపీకి వర్ష సూచన వచ్చింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. ఇది వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుందని.. పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 31 నాటికి వాయుగుండంగా మారనుందని అంచనా వేస్తోంది. ఫిబ్రవరి ఒకటి నాటికి శ్రీలంకకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని అధికారులు తెలిపారు. ఈ నెల 30 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. సగటు ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
సాధారణంగా బంగాళాఖాతంలో జనవరి మొదటి వారం తర్వాత అల్పపీడనాలకు అవకాశం ఉండదంటున్నారు నిపుణులు. అలాగే ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమిస్తాయి కనుక వర్షాలు పడవని.. చాలా అరుదుగా చెబుతున్నారు. సముద్రంపై తేమ ఎక్కువగా ఉండడంతో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలకు ఛాన్స్ ఉంటుందంటున్నారు. అందుకే ఈ అల్పపీడనం ఏర్పడిందని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో చలివాతావరణం కనిపిస్తోంది. రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో మంచు ప్రభావం కనిపిస్తోంది.