పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని పరవాడ మండలం ఫార్మాసిటీ మెయిన్ గేట్ వద్ద, సింహాద్రి స్టిల్ జంక్షన్ వద్ద శనివారం సిఐటియు ఆధ్వర్యంలో ఫార్మా సిటీలో భద్రతా ప్రమాణాల అమలు చేయాలని కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని పరిశ్రమలపై నిర్వహించిన ఆడిట్ నివేదికలను ప్రమాదాల పై నిర్వహించిన నివేదికలను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ ధర్నా నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన యాజమాన్యాలు ప్రమాదాలను గోప్యంగా ఉంచడం రహస్యంగా బయటికి రాకుండా చేయడం పరిశ్రమల్లో కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
భద్రతా ప్రమాణాలు అమలకు యాజమాన్యాలు కృషి చేయాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. జిల్లాలో ఫార్మ పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్న జిల్లా మంత్రి అమర్నాథ్ బాధిత కుటుంబాలను పరామర్శించడం గాని యాజమాన్యాలను సమావేశపరిచి భద్రతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేయడం గానీ చేయకుండా యాజమాన్యాలతో ప్రభుత్వం పరిశ్రమల శాఖ మంత్రి కుమ్మక్కయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అండదండలతో యాజమాన్యాలు భద్రత ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నారని అన్నారు. పరిశ్రమల్లోనూ భద్రత ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్మైల్ ఎక్స్, లారస్, సువెన్, పరిశ్రమల్లో ఈ కాలంలో ప్రమాదాలు జరిగాయని ప్రమాదాలు యొక్క నివేదికలు జిల్లా అధికారులు బయట పెట్టకపోవడం విచారకరమన్నారు. భద్రతా చర్యలు చేపట్టకపోతే తగిన పరిణామాలు ఉంటాయని గనిశెట్టి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ అప్పారావు, ఎన్ నాగ అప్పారావు, దొడ్డి అప్పారావు, తాతారావు, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.