జోషిమఠ్ లో భూమి ఎందుకు కుంగిపోతోందో తెల్చిచెప్పారు నిపుణులు. ఇదిలావుంటే హిమాలయాలకు ముఖద్వారంగా పిలిచే ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ విపత్తు ప్రాంతంగా మారిపోయింది. సముద్ర మట్టానికి 6150 అడుగుల ఎత్తులో ఉన్న చమోలి జిల్లాలో ఉన్న ఈ పట్టణంలో ఎక్కడ చూసినా భూమి కుంగిపోవడం, దాదాపు అంతరించిపోయే దశలో ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, దీనికంతటికీ కారణం అభివృద్ధి పేరుతో అడ్డుఅదుపూ లేకుండా చేపట్టిన నిర్మాణాలే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతాన్ని అత్యంత సున్నితమైన పర్యావరణ ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
జోషీమఠ్ కుంగుబాటుపై శనివారం స్వదేశీ జాగరణ్ మంచ్ ‘ఆసన్నమైన హిమాలయ సంక్షోభం’ పేరుతో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌లో నిపుణులు పాల్గొని ఓ తీర్మాన్ని ఆమోదించారు. దెబ్బతిన్న జోషిమఠ్‌లో ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలు సరిపోవని నిపుణులు పేర్కొన్నారు. ‘‘మానవ అత్యాశతో నడిచే అభివృద్ధి అని పిలవబడే పరిస్థితిని పరిశీలించకపోతే నైనిటాల్, ముస్సోరీ, పౌరీ గర్వాల్ ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు.. సమస్యను పరిష్కరించడానికి దీర్ఘకాలిక చర్యలు తీసుకోవడం గురించి ఆలోచించాలి’’ అని ప్రభుత్వాన్ని కోరారు.
‘‘అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ చార్‌ధామ్ రైల్వేలు ఇది చాలా వినాశనాన్ని కలిగిస్తుంది.. పర్యాటక కేంద్రమైన ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని మరింత భారం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ను మళ్లీ అంచనా వేయాలి.. పునః పరిశీలించాలి’’ అని కోరారు. ఈ ప్రదేశాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య లెక్కించి, పర్యాటక ప్రవాహం పర్యావరణానికి భారాన్ని కలిగించకుండా చూసేందుకు వివరణాత్మక సామర్థ్యాన్ని ఉత్తరాఖండ్ అంచనా వేయాలని సూచించారు.
శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి సుప్రీంకోర్టు నియమించిన ఛార్‌ధామ్ ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ రవి చోప్రా, మాజీ సభ్యులు హేమంత్ ధ్యానీ, ఎస్జేఎం కో-కన్వీనర్ అశ్విని మహాజన్ తదితరులు హాజరయ్యారు.‘‘ఎనిమిదో శతాబ్దంలో శ్రీ ఆది శంకరాచార్య ఏర్పాటుచేసిన జ్యోతిర్లింగం ఉన్న పవిత్రమైన జోషీమఠ్.. నేడు పతనం అంచున ఉంది. జోషిమఠ్ కుంగిపోతుందన్న వార్త యావత్ దేశాన్ని కుదిపేసింది.. ప్రస్తుత సంక్షోభాన్ని ప్రస్తుత సంక్షోభాన్ని దృష్టిలో నివారించడానికి కొన్ని చర్యలు తీసుకున్నా.. ఆదిశంకరాచార్య స్థాపించిన ఈ మొదటి జ్యోతిర్ మఠం కుంగుపోవడాన్ని ఆపలేమని నిపుణులు భావిస్తున్నారు’’ అని మహాజన్ అన్నారు.
జోషీమఠ్‌లోని ఎక్కువ ప్రాంతంలో భూమి కుంగిపోవడంతో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ తపోవన్-విష్ణుగడ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పనులను వెంటనే ఆపేయాలని అధికారులు ఆదేశించారు. ఇక్కడ ప్రజలు బాగుచేయలేని స్థాయిలో పర్యావరణంతో చెలగాటమాడుతున్నారని నిపుణులు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు.
తపోవన్-విష్ణుగడ్ జలవిద్యుత్ ప్లాంట్ అనేది చమోలి జిల్లాలో ధౌలిగంగా నదిపై నిర్మిస్తున్న 520 మెగావాట్ల రన్-ఆఫ్ రివర్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఈ ప్లాంట్ ఏటా 2.5 టీడబ్ల్యూహెచ్ కంటే ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఎలాంటి ప్లాన్ లేకుండా ఇలాంటి భారీ ప్రాజెక్ట్ చేపట్టడంతో పాటు హోటల్స్, రెస్టారెంట్స్ పుట్టగొడుగుల్లా నిర్మించడం వల్ల ఈ ప్రాంతం కుదేలవుతోందని నిపుణులు వివరిస్తున్నారు.
బద్రీనాథ్, హేమ్‌కుండ్ సాహిబ్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రవేశ ద్వారమైన జోషిమఠ్‌లో ఇప్పటికే వందలాది ఇళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జోషిమఠ్‌ను కొండచరియలు విరిగిపడే, విపత్తు ప్రాంతంగా ప్రకటించారు. జోషిమఠ్‌లో మొత్తం 4,500 భవనాలు ఉన్నాయని, వీటిలో 610 భవనాలకు భారీ పగుళ్లు ఏర్పడి ఉండడానికి ప్రమాదకరంగా మారాయి.