జీన్స్ ధరించి కోర్టుకు హజరయ్యే విషయంలో ఇప్పటికే పలు తీర్పలు వచ్చాయి. తాజాగా జీన్స్ వేసుకుని కేసు విచారణకు హాజరైన ఓ సీనియర్ లాయర్‌ను న్యాయమూర్తి బయటకు పంపించిన ఘటన గువహటి హైకోర్టులో శుక్రవారం చోటుచేసుకుంది. ఓ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బీకే మహాజన్ హాజరయ్యారు. ఈ సందర్శంగా ఆయన జీన్స్ దుస్తులు ధరించి కోర్టు హాలులోకి వెళ్లారు. అయితే, ఆయన వస్త్రధారణను గమనించిన జస్టిస్ కళ్యాణ్‌రాయ్ సురానా నేతృత్వంలోని ధర్మాసనం వెంటనే పోలీసులను పిలిచి, న్యాయవాదిని కోర్టు నుంచి బయటకు పంపాలని ఆదేశించింది. ఇదే కారణంగా విచారణను వారం వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ సురానా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి, రిజిస్ట్రార్ జనరల్, బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. ‘‘పిటిషనర్ తరఫు న్యాయవాది బీకే మహాజన్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నందున ఈరోజు కేసు వాయిదా పడింది.. అందువల్ల, అతనిని హైకోర్టు క్యాంపస్ వెలుపల డికార్ట్ చేయమని పోలీసు సిబ్బందిని కోర్టు పిలవాల్సి వచ్చింది’’ అని తెలిపారు. ఈ విషయాన్ని అసోం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు.