ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛాపర్‌లో ఊరేగాలని తాత, నానమ్మల కోరిక,,,పెళ్లి కోసం హెలికాప్టర్ అద్దెకు తెచ్చిన వరుడు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 04:49 PM

తల్లిదండ్రుల మాటే వినని ఈ రోజుల్లో తాతా కోరికను నెరవేర్చాడు ఓ మంచి వ్యక్తి. తమ మనవడు పెళ్లి సమయంలో హెలికాప్టర్‌లో ఊరేగాలనేది తాత నాయినమ్మల కోరిక. దీంతో యువకుడు వారి కోరికను తీర్చడానికి హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుని వధువుతో సహా ఊరేగాడు. వివరాల్లోకి వెళితే రాజస్థాన్‌‌లోని కోటా జిల్లా బంధ ధర్మపురకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణ మురారి ప్రజాపతి కుమారుడు సునీల్‌‌కు.. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఎటావా పట్టణానికి చెందిన రేఖా అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. వీరికి గత గురువారం వివాహం జరిగింది. ఈ రెండు పట్టణాల మధ్య దూరం 60 కిలోమీటర్లే. కారులో వెళితే గంటన్నరలో వెళ్లిపోవచ్చు. అయితే, సునీల్ తాత, నాన్నమ్మలు రామ్ గోపాల్, రామ్ భరోసీలకు తమ మనవడు హెలికాప్టర్‌లో వెళ్లి వధువును తీసుకురావాలనే కోరిక బలంగా ఉంది.


ఇదే విషయం మనవడు వద్ద ప్రస్తావించడంతో.. వారి ఆనందం కోసం సునీల్ ఢిల్లీకి చెందిన ఓ సంస్థ నుంచి హెలికాప్టర్‌ అద్దెకు తీసుకున్నాడు. తాతయ్య, నానమ్మ, తన ఆరేళ్ల మేనకోడలుతో కలిసి హెలికాప్టర్‌లో పెళ్లికూతురి ఊరికి వెళ్లాడు. అక్కడ వధువును హెలికాప్టర్‌లో ఎక్కించుకొని గ్రామంలోని ఏడు రౌండ్లు తిరిగాడు. వివాహ తంతు ముగిసిన తర్వాత తిరిగి వధువుతో సొంతూరుకు బయలుదేరాడు. తమ కోరిక నేరవేరడంతో తాత నానమ్మల ముఖాలు వెయ్యి వోల్టుల బల్బుల్లా వెలిగిపోయాయి. వారితో కలిసి మనవడు హెలికాప్టర్‌లో సెల్ఫీ దిగాడు.


వరుడు సునీల్ మాట్లాడుతూ.. ‘‘నా తాత నానమ్మలను సంతోషపెట్టకుండా నేను ఎలా సంతోషంగా ఉండగలను? వారి కోసం నేను చేయగలిగింది ఇదే’’ అని అన్నారు. నేను చేసిన పనికి వారు సంతృప్తి చెందారు, ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ హెలికాప్టర్‌లో వచ్చిన కొత్తజంటను చూసేందుకు జనం భారీగా ఎగబడ్డారు. ఈ దృశ్యాన్ని గ్రామస్థులతో పాటు బంధువులు, స్నేహితులు తమ మొబైల్‌లో ఫోటో‌లు తీయడానికి ఎగబడ్డారు. దీని కారణంగా ఊరేగింపు కూడా సాయంత్రం నిర్ణీత సమయం కంటే కొంచెం ఆలస్యంగా బయలుదేరింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com