కావలి నియోజకవర్గంలో దళితులపై జరిగిన దాడులపై నిరసిస్తూ, వారికి భరోసా కల్పించేందుకు బీజేపీ శనివారం చేపట్టిన దళిత భరోసా పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. యాత్ర విషయంపై అప్రమత్తంగా ఉన్న పోలీసులు బీజేపీ నేతలను కొందరిని ముందస్తుగా హౌస్ అరెస్ట్‌లు చేయగా, తప్పించుకుని వచ్చిన జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు బ్రహ్మానందంను ముసునూరులోని కరుణాకర్ ఇంటి వద్ద అరెస్టు చేశారు. నియోజకవర్గంలో వైసీపీ నేతల వేధింపులు కారణంగా ఆత్మహత్య చేసుకున్న ముసునూరు కరుణాకర్ కుటుంబాన్ని, ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన కడనూతల పైడి హర్షను, వైసీపీ నేత మహేష్‌నాయుడి చేతిలో దారుణంగా దాడికి గురైన ఉలవపాళ్ల గోచిపాతల తేజలను పరామర్శించేందుకు బీజేపీ నేతలు దళిత భరోసా పాదయాత్రకు పిలుపునిచ్చారు. ముసునూరు అంబేడ్కర్ విగ్రహం నుంచి పాదయాత్ర ప్రారంభించి ఈ మూడు కుటుంబాలను పరామర్శించి వారికి మనో ధైర్యం చెప్పాలని భావించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను కొందరిని వారి ఇళ్ల వద్దనే హౌస్ అరెస్ట్ చేయగా, పద్మావతి శ్రీదేవి ముసునూరు అంబేడ్కర్ విగ్రహం వద్దకు రాగా ఆమెను అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో భరత్‌కుమార్, బ్రహ్మనందంలు ట్రంకు రోడ్డులో కనిపించకుండా వేరే దారుల ద్వారా ముసునూరులోని కరుణాకర్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. విషయం తెలుసుకున్న వారిని కూడా అరెస్టు చేశారు.అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా భరత్‌కుమార్ మాట్లాడుతూ పాదయాత్రను పోలీసులు భగ్నం చేయటం జగన్ అరాచక పాలనకు నిదర్శనమన్నారు.