విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా సోమవారం ప్లాంట్ త్రిష్ణా మైదానంలో కార్మిక ప్రజా గర్జన జరగనుంది. ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ప్రారంభమై రెండేళ్లైన సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రాజకీయ, కార్మిక, ప్రజా సంఘాలు, కార్మిక నాయకులను ఇప్పటికే ఆహ్వానించారు. మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించే ప్రజాగర్జనలో ఉక్కు ఉద్యోగులు, అధికారులు, నిర్వాసితులు, కాంట్రాక్టు కార్మికులు కుటుంబసభ్యులతో సహా హాజరుకావాలని పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రజా పోరాటాలతోనే కాపాడుకుంటామంటూ గర్జన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు పంపే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సుమారు 30వేల మందికి పైగా గర్జనకు హాజరవుతారని పోరాట కమిటీ నాయకులు తెలిపారు. తృష్ణా మైదానంలో 15వేలకు పైగా కుర్చీలు ఏర్పాటు చేశామన్నారు.