ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో మూడు రోజులుగా అధికారులు పల్నాడు జిల్లా, వినుకొండలో హడావుడితో రోడ్డుపై చిరువ్యాపారుల తోపుడు బండ్లను తొలగించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను నిలువునా తొలగించడంపై స్థానికులు పాలకుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మెప్పు కోసమే పనులు చేపడుతున్నారే తప్ప పట్టణానికి ఒరిగిందేమీ లేదని విద్యావంతులు, మేధావుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 26వ తేదీన మున్సిపల్ అత్యవసర సమావేశంలో పట్టణంలో ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ నిషేధంపై కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. అనంతరం ప్రతిపక్ష టీడీపీకి చెందిన జెండాలను, ఫ్లెక్సీలను పట్టణంలో తొలగించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా వైసీపీ ఫ్లెక్సీలను నింపివేయడంపై అధికార పార్టీకి ఒక రూల్, ప్రతిపక్ష పార్టీలకు మరొక రూల్ ఉంటుందా అంటూ అఖిలపక్ష పార్టీ నాయకుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు రోజులుగా పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా రోడ్డును అంటిపెట్టుకొని జీవనం సాగిస్తున్న చిరువ్యాపారులను రోడ్డుపైకి రానివ్వకపోవడంతో తోపుడు బండ్లు పెట్టుకునే అవకాశం లేక వ్యాపారాలను సైతం ఆపివేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.