ఎఫ్డీల రేట్లు బాగా పెరగనున్నాయి. కానీ ఇది అన్ని బ్యాంకులకు చెందిన వారికి మాత్రం కాదు. కేవలం ఆ బ్యాంకులో మాత్రమే. ప్రైవేట్ సెక్టార్ లెండర్ బంధన్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం నేటి నుంచే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. రూ.2 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు పెద్ద మొత్తంలో చేసే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు తెలిపింది. కొత్త రేట్ల ప్రకారం బల్క్ డిపాజిట్లపై 7.90 శాతం వడ్డీ వర్తిస్తుంది. పెద్ద మొత్తంలో చేసే ఎఫ్‌డీలు 365 రోజుల నుంచి 15 నెలల లోపు చేసే ఎఫ్‌డీలకు కొత్త రేట్లు వర్తిస్తాయని బ్యాంక్ అధికార వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది.
బంధన్ బ్యాంక్‌లో 7 రోజుల నుంచి 15 రోజుల ఎఫ్‌డీలపై 5 శాతం వడ్డీ ఇస్తోంది. ఆ తర్వాత 16-90 రోజుల మధ్య మెచ్యూరిటీ డిపాజిట్లపై 5.80 శాతం, 91-180 రోజుల డిపాజిట్లపై 6.25 శాతం, 181 నుంచి 364 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి. అయితే, 365 రోజుల నుంచి 15 నెలల లోపు మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లపై 7.90 శాతంగా వడ్డీ కల్పిస్తోంది. ఆ తర్వాత 15 నెలల నుంచి 5 ఏళ్లలోపు డిపాజిట్లకు కేవలం 6.15 శాతం వడ్డీ రానుంది. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల మెచ్యూరిటీ టెన్యూర్ కలిగిన డిపాజిట్లపై 5 శాతం వడ్డీ వస్తుంది.
బంధన్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. బ్యాంకులో డిపాజిట్ చేసిన సొమ్మును మెచ్యూరిటీకి ముందే ఉపసంహరిస్తే పెనాల్టీ విధించనుంది. ఆర్ఓఐ నిబంధనలను అనుసరించి 1 శాతం మేర పెనాల్టీ ఉంటుందని బ్యాంక్ తెలిపింది. అయితే, రూ.10కోట్లకుపైగా ఉన్న డిపాజిట్లపై ట్రేజరీ ఆమోదంతో మెచ్యూరిటీకి ముందే తీసుకునే వెసులుబాటు ఉన్నట్లు తెలిపింది.
బంధన్ బ్యాంక్ జీఎన్‌పీఏ 2021, డిసెంబర్ 31న 10.8 శాతంగా ఉండగా కొంత పురోగతి సాధించి 7.2 శాతానికి దిగొచ్చింది. అలాగే నికర నిరర్ధక ఆస్తులు ఎన్‌పీఏలు 2021, డిసెంబర్ 31 నాటికి 3.0శాతంగా ఉండగా.. 2022 డిసెంబర్ నాటికి 1.9 శాతానికి తగ్గాయి. డిసెంబర్ 31, 2022 నాటికి బంధన్ బ్యాంక్ డిపాజిట్లు రూ.1,02,283.2 కోట్లుగా ఉంది.