ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్రాన్ని మోసం చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ... రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బస్సు యాత్ర సోమవారం విజయవాడ చేరుకుంది. యాత్రా బస్సుకు బెంజి సర్కిల్ వద్ద ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, సాధన సమితి నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఎంజీ రోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చలసాని మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం 13 జిల్లాల ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. విభ జన సమయంలో మద్దతుగా నిలిచిన పార్టీలు ఇప్పుడు అన్యాయం జరిగిన ఏపీకి న్యాయం చేసేందుకు ముందుకు రావడంలేదన్నారు. హోదాపై మాట మార్చిన పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలతోపాటు.. విద్యార్థులు రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, బీజేపీ చేస్తున్న మోసాన్ని ఖండించాలన్నారు. రాష్ట్రానికి హోదా ఇవ్వడంతో పాటు వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తుంటే వైసీపీ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు బస్సుయాత్రకు మద్దతుగా నిలవాలని కోరారు.