దేశంలో ప్రస్తుతం అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్నా ఇంకా వాటిని చూడని వారు కూడా ఉన్నారన్నది జగమెరిగిన సత్యం. స్మార్ట్ ఫోన్ సౌకర్యాలను వీరు పొందడంలేదు. అందుకే యూపీఐ పేమెంట్స్ కూడా అంతే. కానీ తాజాగా ఓ విప్లవం వచ్చింది. మరోవైపు స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన విప్లవంతో ప్రపంచం మొత్తం మునివేళ్లపై కదలాడుతోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అందుబాటులోకి వచ్చాక గూగుల్ పే, ఫోన్ పే, పేటియం వంటి యాప్‌లతో చిన్న చిన్న పేమెంట్ల నుంచి అన్నింటికి చెల్లింపులు చేస్తున్నారు. అయితే, స్మార్ట్ ఫోన్ లేని వారు గూగుల్ పే వంటి వాటిని వినియోగించలేమని బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఫీచర్ మొబైల్ ఫోన్‌ల కోసం కొన్ని నెలల క్రితం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) విడుదల చేసింది. ఈ ఫీచర్ ఫోన్లు వాడుతున్న వారు సైతం డిజిటల్ లావాదేవీలు చేసేందుకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది. UPI 123PAYతో 40 కోట్ల కంటే ఎక్కువ మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులు.. వెబ్ యాక్సిస్ లేకుండానే విస్తృతమైన ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు.
123పే తో ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) ఉపయోగించి కానీ, ఫీచర్ ఫోన్ యాప్ ద్వారా గానీ, మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా గానీ, ప్రోక్సిమిట్ సౌండ్ ద్వారా గానీ ఫీచర్ ఫోన్ ఉపయోగిస్తున్నవారు యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. ఈ నాలుగు రకాల డిజిటల్ సేవలు ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఎంతగానే ఉపయోగపడతాయి. అయితే, ఏ విధంగా ఈ సేవలను ఫీచర్ ఫోన్ ద్వారా ఉపయోగించుకోవచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఫీచర్ ఫోన్ వాడుతున్న వారు ముందుగా యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. మీ బ్యాంకు అకౌంట్ తో అనుసంధానమైన మొబైల్ నంబర్ ద్వారా ఫీచర్ ఫోన్ నుంచి ఐవీఆర్ నంబర్ (0804516, 0804514 లేదా 6366 200 200) అనే నంబర్లకు ఫోన్ చేయాలి.
ఐవీఆర్ కాల్ ద్వారా మీరు ఏ బ్యాంకు అకౌంట్‌ను యూపీఐ బ్యాంకింగ్ చెల్లింపులకు రిజిస్టర్ చేస్తున్నారో చెప్పాలి
మీరు బ్యాంకు ఖాతాను ఎంచుకున్న తర్వాత.. .mobile.voice@psp రూపంలో యూజర్ ఐడీ ఇస్తారు
ఆ తర్వాత యూపీఐ పిన్ నంబర్ సెట్ చేసుకోవాలి. అందుకోసం మీ డెబిట్ కార్డులోని చివరి ఆరు అంకెలు, బ్యాంకు నుంచి మొబైల్ నంబరు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ సమాచారాన్ని తనిఖీ చేసిన తర్వాతా 4 లేదా 6 అంకెల యూపీఐ పిన్ క్రియేట్ అవుతుంది.
నగదు బదిలీ ఎలా?
యూపీఐ, పిన్ నంబర్ సెట్ చేసుకున్న తర్వాత మీ ఫీచర్ ఫోన్ నుంచి ఐవీఆర్ నంబర్లలో ఏదో ఒకదానికి డయల్ చేయాలి. అప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. 1.మనీ ట్రాన్స్‌ఫర్, 2.బ్యాలెన్స్ చెక్, 3.మొబైల్ రీఛార్జ్, 4.ఎన్ఈటీసీ రీఛార్జ్, 5.సెట్టింగ్స్ ఉంటాయి. మీరు ఏది కావాలో ఎంచుకుని నంబర్ ఎంటర్ చేయాలి.
నగదు బదిలీ చేయాలనుకున్నప్పుడు 1 ప్రెస్ చేసి మనీ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ఎంచుకోవాలి.
ఎవరికి పంపాలో వారి ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. ఎంత డబ్బు పంపుతున్నామో అమౌంట్ సూచించాలి.
ఆ తర్వాత యూపీఐ పిన్ ఎంటర్ చేయడం ద్వారా మీ ఖాతా నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి.