చిత్తూరు సమీపంలోని అమరరాజా గ్రోత్ కారిడార్‌లో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కారిడార్‌లోని ట్యూబులర్ బ్యాటరీస్ డివిజన్‌లో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే బ్యాటరీలు పేలాయని ప్రాథమిక సమాచారం. రాత్రి సుమారు 8-8.30 గంటల సమయంలో ఉద్యోగుల భోజన విరామ సమయంలో ప్రమాదం జరగడంతో ఉద్యోగులంతా క్షేమంగానే ఉన్నారని ఫ్యాక్టరీ వర్గాలు తెలిపాయి. ప్రమాద సమాచారమందగానే చిత్తూరు, పలమనేరుల నుంచి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నా రాత్రి 12 గంటల వరకూ అదుపులోకి రాలేదు. ట్యూబులర్ డివిజన్‌లో తయారైన బ్యాటరీలను ట్రయల్ కోసం రీచార్జి చేసే సెక్షన్‌లో ప్రమాదం సంభవించింది. రీచార్జి చేసే సమయంలో ఒక వైర్ పాడై ఉండడం సిబ్బంది గుర్తించలేదని, దాన్నుంచి స్పార్క్ వచ్చిందని చెబుతున్నారు. ఆ సెక్షన్‌లో లెడ్ యాసిడ్ సహా మరికొన్ని కెమికల్స్ కూడా ఉన్నందున మంటలంటుకున్నాయని సమాచారం. ఈ విభాగంలో మొత్తం 600 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా సోమవారం రాత్రి షిఫ్టులో 180మంది విధుల్లో ఉన్నట్టు సమాచారం. వారిలో 160మంది భోజనానికి వెళ్లగా కేవలం 20 మంది మాత్రమే సెక్షన్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. మంటల ధాటికి వీరంతా దూరంగా వెళ్లిపోగా, ఆ తర్వాత భారీ విస్ఫోటనం జరిగిందని చెబుతున్నారు. ప్రమాదంలో సంబంధిత సెక్షన్ మొత్తం కాలిపోయింది. కాగా, పరిశ్రమకు బీమా ఉందని కంపెనీ తెలిపింది. చిత్తూరు నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో చిత్తూరు-బెంగుళూరు జాతీయ రహదారి పక్కనే 500 ఎకరాల విస్తీర్ణంలో అమరరాజా గ్రోత్ కారిడార్ పేరిట సెజ్ ఏర్పాటైంది.