ఆక్వాసాగు హేతుబద్ధమైన విస్తీర్ణంలో జరిగేలా చూడాలని మంత్రుల కమిటీ మత్స్యశాఖ అధికారులను ఆదేశించింది. సోమవారం అమరావతి సచివాలయంలో ఆక్వా సాధికార కమిటీ సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ రఘురామ్ మాట్లాడారు. ఆక్వా జోన్ లోపల, బయట సాగవుతున్న విసీర్ణాన్ని గుర్తించేందుకు వచ్చే నెలాఖరుకు సర్వే పూర్తవుతుందన్నారు. ఆధార్ అనుసంధానం ద్వారా విద్యుత్ సబ్సిడీకి అర్హులను నిర్ధారించి, అర్హత ఉన్న ప్రతి ఆక్వా రైతుకూ విద్యుత్ సబ్సిడీ అందించాలని అధికారులను ఆదేశించారు. మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 4వేల ఫిష్ ఆంధ్రా హబ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ హబ్‌లకు ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద సబ్సిడీ రుణాలివ్వడానికి కేంద్రప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఆక్వా ఉత్పత్తుల విక్రయం, అన్ని నగరాల్లో ఆక్వా ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించాలని సూచించారు. ఈక్విడార్, బ్రెజిల్‌తో పోటీ పడుతూ ఏపీ నుంచి ఆక్వా ఉత్పతులను ఎగుమతి చేస్తున్నా, ఒడిశాలో మాదిరిగా కనీసం 30ఆక్వాను స్థానికంగా వినియోగం పెంచుకుంటే, మార్కెట్ ఒడిదొడుకులు ఏర్పడినప్పుడు రైతులు నష్టపోకుండా ఉంటారని, ఇందుకోసం దేశీయ మార్కెట్‌ను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును సీరియ్‌సగా పరిగణించాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, మున్సిపల్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.