గవర్నర్లను వివాదాల్లోకి లాగొద్దని, ఆ వ్యవస్థకు గౌరవం ఇవ్వాలని, నాయకులకు ఇంకేమైనా ఆలోచనలు ఉంటే పార్లమెంటులో చర్చించి రాజ్యాంగ సవరణ చేయాలని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. సోమవారం విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గవర్నర్లపై వివాదాల గురించి ప్రశ్నించగా, కావాలనే సృష్టిస్తున్నారని ఖండించారు. గవర్నర్‌లకు పరిపాలనలో జోక్యం చేసుకునే అధికారం లేదని, బడ్జెట్ విషయంలో కూడా ఏమీ చేయలేరని తెలిపారు. ఏపీలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని ఇటీవల ఉద్యోగుల సంఘం నేతలు గవర్నర్‌ను కలిసిన విషయం ప్రస్తావించగా, ఉద్యోగులు ఇచ్చిన వినతిని ప్రభుత్వానికి పంపడం మినహా గవర్నర్ ఇందులో చేయగలిగిందేమీ లేదన్నారు. ఏ విషయమైనా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు సానుకూల దృక్పథంతో కూర్చుని చర్చించుకుంటే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని దత్తాత్రేయ సూచించారు. వ్యతిరేక ఆలోచనలతో ఏమీ సాధించలేరని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.