రాష్ట్రంలో పెనుసంచలనం సృష్టించిన సంకల్పసిద్ధి స్కామ్‌లో వల్లభనేని వంశీ హస్తం ఉందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. సోమవారం గుంటూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘సంకల్పసిద్ధి స్కామ్‌లో ప్రధాన సూత్రధారులైన రంగా, నాని అనే వ్యక్తులు వల్లభనేని వంశీకి ప్రధాన అనుచరులు. దీని వెనుక వల్లభనేని హస్తం ఉండి ఉంటుంది. వంశీ ముఖ్య స్నేహితుడు కొడాలి నాని ప్రమేయంపై కూడా అనుమానం కలుగుతోంది. నిజాయితీ ఉంటే డ్రామాలు ఆపి తక్షణమే వారిద్దరిని పోలీసులకు అప్పజెప్పి సహకరించాలి. స్కామ్‌లో మరో నిందితుడయిన గుత్తా కిరణ్ విదేశాలకు ఎలా పారిపోయాడో చెప్పాలి. గుత్తా కిరణ్ కాల్‌డేటా బయట పెట్టాలి. తాడేపల్లి కొంపకు వారు ఎంత ముట్టజెప్పారో వెల్లడించాలి. ప్రధాన నిందితులు విజయవాడలోని ఒక హోటల్లో సీఐడీ అధికారులను రహస్యంగా కలిసింది వాస్తవం కాదా? అనామకుడి మాదిరిగా వంశీ తనపై పరువునష్టం దావా వేయడం విడ్డూరంగా ఉంది. గోడలు దూకి పార్టీలు మారే, అవినీతి బురద రాసుకున్న నాయకులు కూడా పిట్టకథలు చెబుతారా..! మేం అధికారంలోకి రాగానే నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. గన్నవరానికి పట్టిన చీడని వదిలించి విముక్తి ప్రసాదిస్తాం’’ అని పట్టాభి పేర్కొన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ... ‘‘యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు, మంత్రులు సకల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. కర్నాటక పోలీసులు రోప్ పార్టీలను పెట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం చూశాకైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి’’ అని ఆనందబాబు అన్నారు.