కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎస్సీ, ఎస్టీ జేఏసీ తాలూకా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు చెలమప్ప, రమేష్ నాయకులు మాట్లాడుతూ కంబదూరు మండలం కూరాకులపల్లి గ్రామంలో చెక్కభజన చూడడానికి వెళ్లిన దళిత రామాంజనేయులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. అదేవిధంగా ఇప్పటికీ కురాకులపల్లి గ్రామంలో రెండు గ్లాసుల పద్ధతి, బార్బర్ షాపులో దళితులకు కటింగ్ చేయకూడదని నిబంధన పెట్టారన్నారు. బహిరంగ ప్రదేశాలలో కూర్చోకూడదని మాట్లాడకూడదని బియ్యాన్ని సప్లై చేసే వ్యాన్ కూడా దళిత కాలనీలోకి వెళ్లకూడదని వెళితే అరిష్టమని స్టోర్ డీలర్ ఇంటి దగ్గరికి వచ్చి బియ్యాన్ని తీసుకొని వెళ్లాలని అవమానాలకు గురి చేస్తున్నారన్నారు. దళితుల విషయంలో సంబంధిత అధికారులకు తెలియజేసిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. గతంలో దళితులు దేవాలయ ప్రవేశం చేశారని కక్షతో ఉమ్మడిగా 6మంది దళిత రామాంజనేయులపై దాడి చేసి గాయపరిచి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కురాకులపల్లి గ్రామంలో దళితులు ఎదుర్కొనుచున్న పలు సమస్యలను డిఎస్పి దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందన్నారు. దీనికి డిఎస్పీ బాధితులకు న్యాయం చేస్తానని సానుకూలంగా స్పందించారన్నారు.