శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు పట్టణంలో నకిలీ ధ్రువపత్రాలతో డాక్టర్లుగా చలామణి అవుతున్న వైద్యులు, ఫార్మసిస్ట్ ల్యాబ్, టెక్నీషియన్లు ముగ్గురిని కొత్తచెరువు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డిప్యూటీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ నివేదిత ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మామిళ్ళకుంట క్రాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గుర్రం కిరణ్ కుమార్, ఆవుల మూర్తి, లక్ష్మీ నరసయ్య చిన్నపిల్లల ఆస్పత్రి నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాదుతున్నట్లు విచారణలో రుజువు కావడంతో పాటు లక్షలాది రూపాయలు సామాన్య ప్రజల నుంచి దండుకుంటున్నట్లు రుజువు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి లోతుగా దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ చెప్పారు. ఇలాంటి వైద్యుల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు గుర్తింపు కలిగిన వైద్యశాలలను మాత్రమే సంప్రదించాలన్నారు. ఎక్కడైనా ఇలాంటి నకిలీ వైద్యులు ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులకు గానీ పోలీసులకు గాని సమాచారం అందించాలని సిఐ జాయానాయక్ సూచించారు.