ఓ అపరిచిత వ్యక్తి మేనల్లుడి మాదిరి ఫోను చేసి 40 వేల రూపాయలు పంపమంటే ఫోన్ పే చేసి ఆ మొత్తాన్ని పోగొట్టుకున్న వ్యక్తి ఉదంతం పరుచూరులో మంగళవారం వెలుగు చూసింది. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. వివరాల్లోకి వెళితే అడుసు మల్లికి చెందిన నరసయ్య అనే వ్యక్తికి సోమవారం ఓ అపరిచితుడు ఆయన మేనల్లుడు అయిన సాయి పేరుతో ఫోన్ చేసి తాను అత్యవసరంగా కళాశాల ఫీజు చెల్లించాల్సి ఉందని, వెంటనే 40 వేల రూపాయలు ఫోన్ పే చేస్తే తరవాత తన అమ్మానాన్నలు ఆ మొత్తాన్ని వెనక్కి ఇస్తారని చెప్పాడు. అయితే ప్రస్తుతం తన ఫోన్లో చార్జింగ్ లేనందున తాను చెప్పే రెండు ఫోన్ నెంబర్లకు ఆ మొత్తం పంపాలని కోరాడు. ఇద్దరు వ్యక్తుల ఫోన్ పే నెంబర్లు ఇచ్చాడు.
ఆ ఇద్దరు వ్యక్తులతో ముందే అపరిచితుడు మాట్లాడుకొని డబ్బు వచ్చాక కొంత కమిషన్ ఇస్తానని, మిగిలిన మొత్తం తనకి ఇమ్మని ఒప్పందం చేసుకున్నాడు. అలాగే నరసయ్య ఆ ఇద్దరికి డబ్బు పంపగానే సదరు వ్యక్తి వారి కమిషన్ వారికి ఇచ్చి మిగిలిన డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తరువాత నరసయ్య తన మేనల్లుడు సాయి అమ్మానాన్నలకు డబ్బు ఫోన్ పే చేసిన విషయం చెప్పగా వారు విస్తు పోయారు. సాయి అసలు ఆ ఫోన్ తాను చేయలేదని చెప్పాడు. దీంతో నరసయ్య మోసపోయానని గ్రహించి బంధువుల సాయంతో తాను డబ్బు పంపిన ఫోన్ పే నెంబర్లు కలిగిన వారి కోసం పర్చూరులో గాలిస్తున్నాడు.