విశాఖ ఉక్కు గర్జనలో ఇచ్చిన హమీని ట్విట్టర్ ద్వారా పార్టీలకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. గతంలో ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రస్తావించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘విశాఖ ఉక్కు గర్జనలో,అన్ని రాజకీయ పార్టీలు (బిజెపియేతర) వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవడానికి, అలాగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని చేపట్టడానికి పోరాటం చేస్తామని హామీ ఇచ్చాయి. వారు చేస్తారని ఆశిస్తున్నాను. #Savevizagsteel’అని నినదించారు. ఈ ట్వీట్‌లో ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా ట్యాగ్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని లక్ష్మీనారాయణ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపిన ఆయన.. హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకావడంతో.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని కూడా ప్రస్తావించాలని నేతల్ని కోరుతున్నారు. విశాఖ ఉక్కు గర్జనలో పార్లమెంట్ వేదికగా పోరాడతామని చెప్పారని.. ఆ మాటను నిలబెట్టుకోవాలంటున్నారు. ట్విట్టర్ వేదికగా ఆ హామీని గుర్తు చేశారు.