ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ పతనంతో సతమతమవుతున్న పాకిస్తాన్ కు ఉగ్రదాడులు పెను సవాల్ విసురుతున్నాయి. పాకిస్థాన్‌లోని పెషావర్ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 93కు చేరగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా చేసుకొని జరిపిన ఈ దాడిలో శిథిలాల నుంచి ఇంకా మృతదేహాలను వెలికి తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పోలీస్ లైన్స్‌లోని ఓ మసీదులో సోమవారం మధ్యాహ్నం పాకిస్థాన్ తాలిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా సహాయక చర్యలు కొనసాగుతుండగా.. ఆత్మాహుతికి పాల్పడిన అనుమానితుడి తలను గుర్తించారు.
పెషావర్ నగర పోలీస్ అధికారి మహ్మద్ అజీజ్ ఖాన్ జియో టీవీతో మాట్లాడుతూ.. మసీదులో పేలుడు ఆత్మాహుతి దాడేనని, అనుమానిత ఫిదాయి తలను ఘటన స్థలిలో లభ్యమయ్యిందని చెప్పారు. మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో మసీదులోకి పోలీసుల వాహనంలోనే వచ్చినట్టు భావిస్తున్నామని చెప్పారు. ‘ఈ రోజు కూడా శిథిలాలను తొలగిస్తున్నాం. కానీ ఎవరూ సజీవంగా ఉంటారన్న ఆశ మాత్రం లేదు’ అని అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ 93 మంది చనిపోయారని, మరో 221 మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు.
మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పోలీసులు, సైనిక సిబ్బంది ఉన్నారు. ఘటనలో కనీసం ఐదుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లు, మసీదుకు చెందిన మత గురువు మౌలానా షహీబ్‌జాదా నూరుల్ అమీన్ మరణించారు. సోమవారం మధ్యాహ్నం 1.40 గంటలకు మసీదులో భద్రతా సిబ్బంది సహా మరికొందరు ప్రార్థనలు చేస్తున్న సమయంలో ముందు వరుసలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. శక్తివంతమైన పేలుడు ధాటికి మసీదులోకి కొంత భాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. ఘటన సమయంలో 400 మంది వరకూ మసీదులో ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.
పెషావర్ లేడీ రీడింగ్ ఆసుపత్రి అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దాదాపు 20 మంది పోలీసు అధికారులు, భద్రతా సిబ్బంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఉగ్ర ముఠా తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ ప్రకటన చేసింది. గతేడాది ఆగస్టులో అఫ్గానిస్థాన్‌లోని తమ కమాండర్ ఉమర్ ఖలీద్ ఖురసానిని చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు ప్రకటించింది. 2007లో ఏర్పాటైన టీటీపీ కొన్నేళ్లుగా పాక్‌లో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతోంది. అల్‌ఖైదాతో సన్నిహిత సంబంధాలున్న ఈ ముఠా.. పాక్‌లోని తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. 2014లో పెషావర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌పై దాడికి పాల్పడి 131 మంది విద్యార్థుల సహా 150 మందిని పొట్టనబెట్టుకుంది.
ఇక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు పాకిస్థాన్‌లో సోమవారం పర్యటించాల్సిన సమయంలోనే ఈ ఉగ్రదాడి జరిగింది. దీంతో ఆయన పర్యటన రద్దయింది. అలాగే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన పాక్.. మంగళవారం అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనుంది.