భారతదేశంలో ఉన్నత విద్య చదివే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2019-20లో ఈ సంఖ్య 3.85 కోట్లు ఉంటే, 2020-21లో ఇది 4.14 కోట్లకు పెరిగింది. 2014-15 నుంచి ఉన్నత విద్య చదివే వారిలో 21 శాతం పెరుగుదల ఉందని అఖిల భారత ఉన్నత విద్యపై సర్వే (AISHE) 2020-2021 ఆదివారం పేర్కొంది. ఉన్నత విద్య చదివే వారి సంఖ్య పెరిగిన రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక మరియు రాజస్థాన్ విద్యార్థుల సంఖ్య పరంగా మొదటి 6 స్థానాల్లో ఉన్నాయి.
AISHE నివేదిక ప్రకారం యూజీ స్థాయిలో, ఆర్ట్స్‌లో అత్యధికంగా 33.5 శాతం, సైన్స్ 15.5 శాతం, కామర్స్ 13.9 శాతం, ఇంజనీరింగ్ & టెక్నాలజీ 11.9 శాతం ఉన్నారు. పీజీ స్థాయిలో అత్యధికంగా 20.56 శాతం విద్యార్థులు సోషల్ సైన్స్ కోర్సులను ఎంచుకున్నారు. తరువాత సైన్స్ ఎంచుకున్న వారి శాతం 14.83 శాతంగా ఉంది. దూరవిద్య ద్వారా 45.71 లక్షల మంది ఉన్నత విద్య చదివేందుకు ఎన్‌రోల్ చేసుకున్నారు. అందులో 20.9 లక్షల మంది మహిళలు ఉన్నారు. సర్వే ప్రకారం రాజస్థాన్ (92), ఉత్తరప్రదేశ్ (84), గుజరాత్ (83)లో అత్యధికంగా యూనివర్సిటీలు ఉన్నాయి. ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకునేందుకు ఉన్నత విద్య చదివేందుకు విద్యార్థులు మక్కువ చూపుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది.