షెడ్యూల్ ప్రకారం ప్రతినెలా ఒకటో తేదీ నుంచి బియ్యం కార్డుదారులకు సరకుల పంపిణీ ఉంటుంది. బియ్యంతోపాటు కందిపప్పు, చక్కెర కూడా ఇవ్వాలి. జిల్లావ్యాప్తంగా 1, 367 చౌకదుకాణాల ద్వారా 5, 58, 347 కార్డులకు బియ్యం పంపిణీ చేయాల్సివుంది. బియ్యం 8, 597 మెట్రిక్ టన్నులు, కందిపప్పు 524 మెట్రిక్ టన్నులు, పంచదార 226 టన్నులు చౌకదుకాణాలకు సరఫరా కావాల్సి ఉంది. కానీ, దాదాపు 95 శాతం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఫలితంగా నిరుపేదలపై భారం పడుతుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు రూ. 115 నుంచి రూ. 125 వరకు ధర ఉంది. పౌర సరఫరాల దుకాణాల ద్వారా రాయితీతో రూ. 67లకు ఇస్తారు. అంటే కార్డుదారుడు బయట కిలో కందిపప్పు కొనాలంటే రూ. 50 నుంచి రూ. 60 అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.