తిరుమలలో భక్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆదిభట్ల శ్రీ కళాపీఠం వ్యవస్థాపకురాలు, సినీనటి కరాటే కళ్యాణి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూ నాణ్యత తగ్గిందని.. లడ్డూ రేటును తగ్గించాలని డిమాండ్ చేశారు. తాగునీటి కోసం గాజు గ్లాసులను కేటాయించి భక్తుల నుంచి నిలువుదోపిడీ చేస్తున్నారన్నారు. తిరుమల లడ్డూ కౌంటర్‌లో చోరీ భద్రతా వైఫల్యమే కారణమన్నారు. వకుళామాత ఆలయంలో చోరీ భక్తులకు ఆవేదనను కలిగించిందని తెలిపారు. తిరుపతి, తిరుమలలో పార్కింగ్ దందా మితిమీరిపోయిందని మండిపడ్డారు. మాఢవీధులలో సీఎంఓ స్టిక్కర్ ఉన్న వాహనం తిరిగితే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. తిరుమల ఆలయం పై డ్రోన్స్ తిరగడం ఆలయ పవిత్రతను దెబ్బతీస్తోందని.. రూ.500 జరిమానా వేసి డ్రోన్ కేసును మమా అనిపించారని కళ్యాణి విమర్శించారు.