టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డైమండ్ రాణి వ్యాఖ్యలపై మంత్రి రోజా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘లోకేష్ అంకుల్’’ అంటూ రోజా విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... యువగళం ప్రారంభించిన పప్పునాయుడు తన తండ్రి ఈ రాష్ట్రానికి ఏం చేశారో, ఏం చేయబోతున్నారో చెప్పకుండానే నడుస్తున్నారన్నారు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకొని హైదరాబాద్ లో దాచుకోవడమే కాకుండా మళ్ళీ తండ్రిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించాలని తహతహలాడుతున్నారన్నారు. ఒకవైపు చంద్రబాబు కాంగ్రెస్ తో కుమ్మక్కై వేధించినప్పటికీ జగనన్న ఆత్మస్థైర్యంతో పాదయాత్రను ప్రారంభించారని అన్నారు. పేదల కష్టాలను వింటూ అధికారంలోకి వచ్చాక తూచా తప్పకుండా ఆ కష్టాలను తీరుస్తున్నారని తెలిపారు. ఆ ధైర్యంతోనే మళ్ళీ ఓట్లు అడుగుతున్నామని మంత్రి చెప్పారు.