ఆంధ్రప్రదేశ్‌లో మునిగిపోతున్న నావను కాపాడ్డానికి అధికార వైసీపీ ఆపసోపాలు పడుతోంది. ఎమ్మెల్యేలు, మాజీలు, సీనియర్లు తిరుగుబాటు ప్రకటించడం.. కొందరైతే ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం.. అన్నింటికి మించి గతంలో ప్రభుత్వాలను కూల్చేసిన చరిత్ర ఉన్న ఫోన్ ట్యాపింగ్ అంశాని ఇవాళ ఏపీ లో అధికారపార్టీ ఎమ్మెల్యేలు లేవనెత్తడం కలకలంరేపుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాప్ అయినట్లుగా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అయితే అవన్ని నిరాధారాలని.. వెళ్లిపోవడానికి కారణాలు వెతుక్కుంటున్నారని మరో సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. ఈ సవాల్‌ను కోటంరెడ్డి స్వీకరించారు. బుధవారం మీడియా సమావేశంలో ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు బయటపెట్టారు. ఈ సందర్బంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ప్రెస్‌మీట్ పెట్టాల్సి వస్తుందనుకోలేదని, వైఎస్సార్ , జగన్ కు తనెప్పుడూ విధేయుడిగానే ఉన్నానని చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడ్డానని, అధికారంలోకి వచ్చాక గుర్తింపు ఇవ్వకపోయినా బాధపడలేదన్నారు. పార్టీలో ఎన్నో అవమానాలను భరించానని, పార్టీ గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదని అన్నారు. తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి చెప్పారన్నారు. ముందు తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే నమ్మలేదన్నారు. సీఎం జగన్‌పై కోపంతో ఆ అధికారి అబద్ధం చెప్పారని భావించానన్నారు. 20 రోజుల ముందు తన ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారం దొరికిందన్నారు. సీఎం గానీ, సజ్జల గానీ చెప్పకుండా తన ఫోన్ ట్యాప్ చేయరని... అనుమానాలు ఉన్న చోట తానుండాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నానని తన ఫోన్ ట్యాంపింగ్ చేశారన్నారు.