రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ ని ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్రస్థాయిలో కుదిపేస్తోంది. సొంత పార్టీ కీలక నేతలు, పార్టీకి వీరవిధేయులుగా ఉన్నవారి ఫోన్లపైనే నిఘానేత్రం సారించడం.. వారి కదలికలను సైతం పసిగడుతుండడం పార్టీలో కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతల ఫోన్‌లపైనే నిఘా పెట్టిన జగన్ సర్కారు ఇప్పుడు.. సొంతపార్టీకి చెందిన ముఖ్యనేతలపైనా.. ఎమ్మెల్యేలపైనా నిఘా పెట్టిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మూడున్నరేళ్ల పాలన తర్వాత జగన్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందంటూ సొంత సర్వేలు నివేదికలు ఇస్తుండడంతో జగన్‌లో అభద్రతా భావం పెరిగిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీంతో అందరిపైనా నిఘా పెడుతున్నారని చెబుతున్నారు. తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే, సీఎం జగన్ కు నమ్మినబంటుగా ఒకప్పుడు పేరొందిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి , మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి బాహాటంగా ప్రకటించారు. రాష్ట్రంలో పాలకపక్షం నుంచి ప్రతిపక్షం దాకా నేతలెవరైనా నేరుగా తమ ఫోన్లలో మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తోంది. అధికారులైనా, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులైనా వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌టైమ్‌లలోనే మాట్లాడుకుంటున్నారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థమవుతుందని అంటున్నారు.