రాజధాని విషయంలో సీఎం జగన్ రెడ్డి మడమ నెలకోసారి తిరుగుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ‘ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని అన్నాడు. ఎన్నికలు అయిన తర్వాత మూడు రాజధానులు అన్నాడు. ఇప్పుడు ఏకైక రాజధాని అంటున్నాడు. రాజధాని అంశం సుప్రీం కోర్టులో ఉండగా విశాఖే రాజధాని అని ఇన్వెస్టర్ల సదస్సులో చెప్పడం ముమ్మాటికీ కోర్టు ధిక్కారం. తన చర్యలతో పచ్చి మోసగాడినని జగన్ రెడ్డి నిరూపించుకొన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, వివేకా హత్య కేసులో తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నవారికి సీబీఐ నోటీసులు అందేసరికి జగన్ రెడ్డి షాక్‌కు గురయ్యారని, ఆ విచారణను డైవర్ట్ చేయడానికే విశాఖ రాజధాని అని మాట్లాడటం మొదలు పెట్టారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలు కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ పేర్కొన్నారు.