టీటీడీ తాజాగా సరికొత్త ఆలోచన చేసింది. తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రత్యేకత ఉంది. దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. దేశంలో ఎన్నో ఆలయాలున్నా.. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా భావిస్తారు. ఇంతటి విశిష్టమైన లడ్డూ తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తిరుమలలో లడ్డూ విక్రయ కేంద్రం ద్వారా నిత్యం లక్షకు పైగా లడ్డూలు వితరణ అవుతాయి. ఇంత పెద్ద సంఖ్యలో లడ్డూలను నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా, తాజాగా అందిస్తోంది టీటీడీ. తిరుమలలో భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతో లడ్డూల తయారీకి అత్యాధునిక సాంకేతికతో కూడిన యంత్రాలను వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది.
తిరుమలలో లడ్డూల తయారీ కోసం అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రూ. 50 కోట్లతో ఈ లడ్డూల తయారీ యంత్రాలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జనవరిలో 20.78 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని ఆయన తెలిపారు. హుండీ కానుకల ద్వారా రూ. 123.07 కోట్లు రాగా, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 1.07 కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన చెప్పారు.
జనవరి 28న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయని చెప్పారు. లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించినట్లు వివరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.