మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ కి అప్పగించాలని వైసీపీ కోరిందని మేయర్ చెప్పడం దుర్మార్గమని, జగన్ ప్రతిక్షణం అబద్దాలు ఆడినట్టే మేయర్ సురేష్ బాబు అబద్దాలు ఆడితే ప్రజల్లో నమ్మకం కోల్పోతారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ మండిపడ్డారు. శనివారం కడప నగరంలోని హరి టవర్స్ లో మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ ప్రతి పక్షంలో ఉన్నపుడు సీబీఐ విచారణ కోరుతూ 2019 మార్చి 19 న హైకోర్టును ఆశ్రయించారు. జగన్ సీఎం కాగానే 2020 ఫిబ్రవరి 6 న కేసును ఉపసంహరించుకున్నారనే వాస్తవాన్ని మేయర్ సురేష్ బాబు గుర్తెరగాలని అన్నారు. జగన్ సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసు దోషులను కాపాడుకోవడాని ప్రయత్నించడం చూస్తుంటే మహానేత వైస్సార్ మరణం పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
వివేకానందరెడ్డి హత్య కేసు చేధింపు సీబీఐని కోరి ఉంటే ఇన్నేళ్ల సమయం ఎందుకు పట్టిందని, కేసును పక్క రాష్ట్రానికి ఎందుకు తరలించారని ప్రశ్నించారు. హత్య కేసు దోషులను తప్పించడానికే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వివేకానందరెడ్డి కూతురు సునీత కేసును పక్క రాష్ట్రానికి తరలించమని చెప్పింది నిజం కాదా జగన్ సొంత చెల్లెలు షర్మిల దోషులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం నిజం కాదా ఇన్వష్టిగేషన్ చేస్తున్న సీబీఐ అధికారులపై ఎదురు కేసులు పెట్టింది ఎవరో మేయర్ చెప్పాలని డిమాండ్ చేశారు. నిసిగ్గుగా వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐని వైసీపీనే కోరిందని చెప్పడం మానుకోవాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జిపి గుర్రప్ప, మాజీ ఏపీపీ శంకర్ రెడ్డి, బలిజ సంఘం నాయకులు నాగరాజు, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు గన్నేపాటి మల్లేష్ పాల్గొన్నారు.